ఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు

ఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం హోమాలు, యాగాలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడుతున్న తుఫాన్లు సైతం వానలను కురిపించటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గిపోయాయి. రాబోయే ఎండాకాలానికి మంచినీటికి సైతం ఇబ్బందులు తప్పవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇదే క్రమంలో తమిళనాడు రాష్ట్రం ఏమో వర్షాలు, వరదలతో మునిగిపోతుంది. వద్దన్నా వానలు పడుతున్నాయి. చలికాలంలో వర్షాకాలాన్ని మించి వానలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చెన్నైతో పాటు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సిటీతోపాటు మరో 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. రాబోయే మూడు రోజులు అంటే.. నవంబర్ 29వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించింది. ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసింది. చెన్నై, చెంగళ్ పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, చుడ్లూరు, పుదుచ్ఛేరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నట్లు రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది వాతావరణ శాఖ

స్కూల్స్, కాలేజీలకు సెలవులు :

భారీ వర్షాల క్రమంలో తమిళనాడులోని చాలా జిల్లాల్లో స్కూల్స్ మూసివేశారు. చెన్నైలో ఇప్పటికే మూడు రోజులుగా స్కూల్స్ కు సెలవులు ప్రకటించగా.. మరో మూడు రోజులు అంటే నవంబర్ 29వ తేదీ వరకు వీటిని కొనసాగించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే ఈ వర్షాలు పడుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు ఇలా ఉంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు చిరు జల్లుల వరకే పరిమితం అవుతున్నాయి. వానాకాలంలోనూ ఆశించిన స్థాయిలో పడలేదు.. ఇప్పుడు కూడా పడటం లేదు.. దీంతో ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. ఏపీలోని రాయలసీమ ప్రాంతం, కోస్తాలో అయితే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కరువు ఛాయలు అలుముకున్నాయి.