
- పొంగిపోర్లుతున్న వనదుర్గా ప్రాజెక్ట్, వాగులు
- కూలిన ఇండ్లు.. జలమయమైన కాలనీలు
మెదక్/మెదక్‌టౌన్/వెల్దుర్తి/శివ్వంపేట/నిజాంపేట/పాపన్నపేట/కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండ పోత వాన కురిసింది. మంజీరా నది, హల్దీ, పసుపు లేరు, గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. జిల్లా లో సరాసరి 9.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వెల్దుర్తిలో అత్యధికంగా 14.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంజీరా నదికి వరద పెరగడంతో కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్ పై నుంచి 9,237 క్యూసెక్కుల నీరు సర్ ప్లస్ అవుతోంది. దీంతో వనదుర్గామాత ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.
రాజగోపురంలోనే దుర్గమ్మ పూజలందుకుంటోంది. హల్దీ, గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ లోకి వర్షం నీరు చేరి పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. మెదక్ పట్టణం సాయినగర్ కాలనీ జలమయమైంది. వెల్దుర్తిలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇళ్లలోకి మురుగు నీరు చేరింది. స్టేషన్ మాసాయిపేట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వర్షం నీరు పెద్ద మొత్తంలో నిలిచి కొప్పుల పల్లి, బొమ్మారం, నాగ్సాన్ పల్లి గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.
శివ్వంపేట గ్రామ పరిధిలోని కుంటలు నిండి పొలాల్లోకి వచ్చిన నీళ్లలో చేపలు రావడంతో స్థానికులు ఎగబడ్డారు. చిలప్‌చెడ్ మండలం బండపోతుగల్ లో జహీర్‌అలీ రేకుల ఇల్లు, జగ్గంపేటలో గంగమ్మకు చెందిన పెంకుటిల్లు, కౌడిపల్లి మండలం రాజిపేటలో గాండ్ల లక్ష్మమ్మ ఇల్లు, చేగుంటలో ఒక ఇల్లు వర్షానికి కూలిపోయాయి.
రామాయంపేట తహసీల్దార్ భవనంతోపాటు, పెంకుటిలో కొనసాగుతున్న నిజాంపేట తహసీల్దార్ ఆఫీస్ కురుస్తోంది. కౌడిపల్లి మండలం జాజి తండా వద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో తిమ్మాపూర్ నుంచి కుషన్ గడ్డ తండా, జాజి తండాకు, శివ్వంపేట మండలం నవాపేట్– గోమారం గ్రామాల మధ్య రోడ్డుపై లోలెవల్ కాజ్ వే మీద నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ పట్టణంతో పాటు హవేళీ ఘనపూర్ మండలాల్లోని వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పర్యటించారు. నర్సాపూర్–చేగుంట వెల్కమ్ బోర్డు వద్ద పూర్తిగా కూరుకుపోయిన డ్రైనేజ్ పైప్‌లైన్‌ను ఫైరింజన్ తెప్పించి క్లియర్ చేయించారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట/కోహెడ/తొగుట, వెలుగు : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మూడో రోజూ ముసురు వర్షం కొనసాగింది. గురువారం సిద్దిపేట జిల్లాలో 81 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మోయ తుమ్మెద, కూడవెల్లి వాగులు పొంగిపొర్లుతున్నాయి. జనగామ జిల్లా సరిహద్దులోని సొలామైల్ వద్ద రోడ్డు తెగిపోవడంతో జనగామ–-సిద్దిపేట మధ్య, బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు రోడ్డు పై నుంచి ప్రవహిస్తుండటంతో సిద్దిపేట–-హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని తంగళ్లపల్లి వాగు నిండుగా ప్రవహిస్తుండగా సింగరాయ ప్రాజక్టు నిండి సమ్మక్క , కిష్టమ్మ చెక్ డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి.
బస్వాపూ ఫీడర్ ఛానల్ నుంచి వరద నీటిని శనిగరం చెరువులోకి మళ్లిస్తున్నారు. బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగును డీసీపీ మహేందర్ పరిశీలించి పలు జాగ్రత్తలను సూచించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ముసురు వర్షాలకు పలువురి ఇల్లు కూలిపోయాయి. పలు చెరువులు మత్తళ్లు దుంకుతుండగా ప్రజలు చేపలు పట్టడంలో నిమగ్నమయ్యారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కపుర్ వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ అదనపు టీఎంసీ పైప్ లైన్ కుంగింది. పైప్ లైన్ పైన పోసిన మట్టి కుంగిందని, దీంతో ఇబ్బంది ఏమీ లేదని అధికారులు తెలిపారు.
సంగారెడ్డిలో...
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వాన దంచి కొట్టింది. జిల్లా వ్యాప్తంగా 61.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అందోల్ మండలంలో అత్యధికంగా 108.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. సింగూరు, మంజీరా, నల్లవాగులలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో 29.917 టీఎంసీల సామర్థ్యం గల సింగూరులో ప్రస్తుతం నీటిమట్టం 19.342 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 8625 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 385 క్యూసెక్కుల వరకు కొనసాగుతోంది.
సంగారెడ్డి మున్సిపాలిటీ, కంగ్టి, దెగుల్ వాడీ, నాగూర్, చాప్టా, సర్దార్ తండా, ముకుంద నాయక్ తండా, సుక్కల్ తీర్థ్, దామర్ గిద్ద గ్రామాలల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని ఇండ్లు కూలిపోయాయి. రాయికోడ్ మండలం ధర్మపుర్ రోడ్డు బ్రిడ్జి తెగిపోయి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. రాయికోడ్, సదాశివపేట, మొగుడంపల్లి, నాగల్ గిద్ద, అందోలు మండలాల్లో పత్తి, కూరగాయల పంటలలో వరద నీరు వచ్చి చేరింది. అమీన్ పూర్ మండలం దయరా గ్రామంలోని గండిగూడెం పెద్ద చెరువులో వరద నీటిలో కాలుష్యం నీరు కలవడం వల్ల భారీగా చేపలు చనిపోయాయి.