వణికిస్తోన్న ముసురు

వణికిస్తోన్న ముసురు
  • సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో భారీ వర్షం
  • వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ముసురు
  • పట్టణాలు, గ్రామాల్లో నీటమునిగిన కాలనీలు
  • సూర్యాపేట జిల్లా ముకుందాపురం వద్ద  వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు
  • మహబూబాబాద్​జిల్లా కొమ్ములవంచ దగ్గర 
  • వరద నీటిలో చిక్కుకున్న స్కూల్​ బస్సు
  • దంతాలపల్లిలో 19.93 సెం.మీల వర్షం

వెలుగు, నెట్​వర్క్ : శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా ముసురు పడుతోంది. సూర్యాపేట, మహబూబాబాద్​జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు పొంగి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట, మహబూబాబాద్​ సహా పలు పట్టణాలు, గ్రామాల్లోని అనేక కాలనీలు నీటమునగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ ​జిల్లా తొర్రూరు నుంచి వస్తున్న ఆర్యభట్ట ప్రైవేట్ స్కూల్ బస్సు కొమ్ములవంచ  లోలెవల్ బ్రిడ్జి దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది. దీంతో బస్సు మధ్యలోనే ఆగిపోయింది. గ్రామస్తులు గమనించి పిల్లలను ఎత్తుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో​ఆదర్శ పాఠశాలకు వెళ్లే రూట్​లో ఉన్న కల్వర్టు నీటమునగడంతో పిల్లలు స్కూల్లోనే చిక్కుకున్నారు. గ్రామస్తులు  పిల్లలను ఇవతలి వైపునకు దాటించారు. మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో 19. 93 సెంటీమీటర్లు, నెల్లికుదురులో 14. 35, నరసింహులపేట 14. 2,  తొర్రూరులో11. 8,  మరిపెడలో 10. 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆకేరు , పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తొర్రూరు నుంచి కంఠాయపాలెంకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్​మండల పరిషత్ ఆఫీసు, ఐకేపీ, ఎంపీడీవో ఆఫీసులు, స్కూల్ లోకి వరద నీరు చేరింది. నర్సింహులపేట మండల కేంద్రం వచ్చే దారిలో రెండు లో లెవెల్ వాగులు దాటనియ్యకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  దంతాలపల్లి మండలం తూర్పు తండాలో ఇండ్లు నీట మునిగాయి.

మహిళను కాపాడిన పంచాయతీ సిబ్బంది 

కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, గుండాల, పాల్వంచ, బూర్గంపహడ్​, ఆళ్లపల్లి, ముల్కలపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముల్కలపల్లి మండలం అన్నారం చప్టా వద్ద వాగులో కొట్టుకుపోతున్న మహిళను పంచాయతీ సిబ్బంది కాపాడారు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, మోటకొండూర్, తుర్కపల్లి మండలాల్లో కుండపోత వర్షం పడింది. యాదగిరిగుట్టలోని రోడ్లు, ఆలయ ఘాట్ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు ఎంట్రీ వద్ద వరదనీరు అధికంగా చేరుకోవడంతో.. భక్తులు ఇబ్బంది పడ్డారు. ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాకు వెళ్లే రింగ్ రోడ్ చౌరస్తా చెరువును తలపించింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు, చింతలపాలెం, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో 11సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో 9.73సెంటీమీటర్లు కురిసింది. మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి.

జనగామ జిల్లాలో జోరువాన

జనగామ జిల్లాలో శుక్రవారం జోరువాన కురిసింది.  జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాతో పాటు హైదరాబాద్​ రోడ్డు జలమయమైంది. వాహనాల రాకపోకలకు  ఇబ్బందులు కలిగాయి. సెయింట్​ మెరిస్​ స్కూల్​ రోడ్​ ఏరియా, శ్రీ నగర్​ కాలనీలు మునిగిపోయాయి. పెంబర్తి సమీపంలో కొత్తగా నిర్మించిన జిల్లా రవాణా శాఖ ఆఫీస్​ చుట్టూ నీళ్లు చేరాయి. వరంగల్ జిల్లాల్లో  పొద్దుటి నుంచి వాన పడుతుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు మునిగాయి. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, కమలాపూర్, హసన్ పర్తి, దామెర, ఎల్కతుర్తి, అయినవోలు మండలాల్లో  భారీ వాన పడింది.