ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

అల్లాదుర్గంలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షం

​మెదక్/పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లాలో కుండపోత వానతో జన జీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మెదక్​ జిల్లాలో సరాసరి 8.6 సెంటీమీటర్ల వర్షం కురువగా, అల్లాదుర్గంలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లో  చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతుండగా, ఆయా మండలాల్లోని వాగులు, వంపులు జోరుగా ప్రవహిస్తున్నాయి. మంజీరాతోపాటు, హవేలీఘనపూర్​ మండలం కూచన్ పల్లి, సర్ధన వద్ద నిర్మించిన చెక్​డ్యామ్​లు, కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతున్నాయి.  

రాకపోకలు బంద్..

పాపన్నపేట మండలం కొత్తపల్లి వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండగా, వెహికల్స్​ రాకపోకలకోసం నిర్మించిన టెంపరరీ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మెదక్ - బొడ్మట్​పల్లి రూట్​లో రాకపోకలు స్తంభించాయి. ఇదే మండలం అర్కెల వద్ద కూడా వాగు వరద నీరు రోడ్డును ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలో... 

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 53.3 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. కోమటిచెరువు మత్తడి దూకింది.  కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు పొంగిపొర్లడంతో సిద్దిపేట–హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  కోహెడ మండలంలోని  శనిగరం మధ్య తరహా ప్రాజక్టు మత్తడి పారుతుండగా, జిల్లాలోని  కోహడ మండలంలోని ఎల్లమ్మ వాగు, మిరుదొడ్డి మండలంలో కూడవెల్లి, చేర్యాల మండలం దొమ్మాట, వర్గల్ మండలం హల్దీ వాగులు పొంగి పొర్లుతున్నాయి. చేర్యాల మండలం నర్సంపల్లి నుంచి రాంపూర్ వెళ్లే రోడ్డు వరద నీటికి తెగిపోయింది. స్థానికులు ఇబ్బంది పడ్డారు. 

ఏడుపాయలలో వరదలను పర్యవేక్షించిన ఎస్సీ

భారీ వరదలతో ఏడుపాయల పరిసరాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. ఆదివారం ఆమె ఏడుపాయలను సందర్శించారు. వనదుర్గమ్మ ఆలయం ముందు, ఆనకట్ట వద్ద, చెక్​ డ్యామ్​ వద్ద వరదలను పరిశీలించారు.

దెబ్బ తిన్న ఇండ్లు

పటాన్​చెరు, వెలుగు : రెండు రోజులుగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని కానుకుంట గ్రామానికి చెందిన జయమ్మ, బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలోని పాత బస్తీలో నివాసముంటున్న మహ్మద్​ ఖాన్​ ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న బొల్లారం మున్సిపల్​వైస్​ చైర్మన్​ అంతిరెడ్డి అనిల్​ రెడ్డి బొల్లారంలోని మహ్మద్​ ఖాన్​ను కలిసి పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. 

ట్రాన్స్​ఫార్మర్లకు ఫెన్సింగ్​ ఏర్పాటు చేయండి

విద్యుత్​ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

దుబ్బాక, వెలుగు : ప్రమాదకరంగా ఉన్న విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్లకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆదేశించారు.  ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూలిపోయేలా ఉన్న  విద్యుత్​ స్తంభాలను గుర్తించి రిపేర్లు చేపట్టాలన్నారు. ఆదివారం దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డులో ఆయన పర్యటించారు. తమ వార్డులో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను తొలగించాలని పలు మార్లు అధికారులకు విజ్జప్తి చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్​లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గంగమ్మకు పూజలు.. దుర్గమ్మకు బోనాలు

వేడుకల్లో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి,  జోగిని శ్యామల

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గ భవానీ మాత సన్నిధి  ఆదివారం బోనాలతో జాతర తలపించింది. పోటెత్తిన గంగమ్మ కు మెదక్  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జోగిని శ్యామలతోపాటు, వంద మంది మహిళలతో కలసి ఆమె రాజగోపురంలోని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాలక మండలి  చైర్మన్ బాల గౌడ్, ఈవో సార శ్రీనివాస్ ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. మంజీరా నదీ పరవళ్ళు.. బోనాల సందడి తో ఏడుపాయల కళకళలాడింది. 

‘గీతం’లో ముగిసిన నేషనల్​ కాన్ఫరెన్స్​ 

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో మూడు రోజులుగా ‘మ్యాథమెటికల్​ సైన్స్​అండ్ ఎమర్జింగ్ అప్లికేషన్స్​ ఇన్​ టెక్నాలజీ అనే అంశంపై నిర్వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్​ ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్టుగా వరంగల్​ కాకతీయ యూనివర్శిటీ డీన్​ ప్రొఫెసర్​ మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ, -ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన ఏపీటీఎస్​ఎంఎస్​తో గీతం స్కూల్​ ఆఫ్​ సైన్స్, గణిత శాస్ర్త విభాగం ఈ సదస్సులను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పరిశోధనల ద్వారా వినూత్న ఆలోచనలు వస్తాయని, కొత్త విషయాలను స్టూడెంట్స్ తెలుసుకోగలరని తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎస్ఎంఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ఎన్.కిషన్, స్కూల్​ఆఫ్​ సైన్స్ ప్రిన్సిపాల్ దత్తాత్రి కే.నగేశ్, కన్వీనర్​ బీఎం నాయుడు, సెక్రటరీ డాక్టర్​ పీ.నారాయణస్వామి, మిజోరాం ఎన్​ఐటీ టీం రాధ, డాక్టర్​ శివారెడ్డి శేరి, ఎం.రెజా, డాక్టర్​ మల్లికార్జున్​రెడ్డి. ఎం. శ్రీకుమార్​పాల్గొన్నారు. 

చివరి ఆయకట్టుకూ సింగూర్ నీళ్లిస్తాం..

పుల్కల్, వెలుగు : చివరి ఆయకట్టు వరకు సింగూర్ నీళ్లు అందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం ఆయన చౌటకూర్ మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ శివారులోని పలు చెరువులు, కుంటలకు సింగూర్ నీళ్లను అందించేందుకు డీ6 కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. గోంగ్లూర్ తండా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమటి చెరువులోకి కెనాల్​​ను తవ్వించడంలో సర్పంచ్ అల్వాల రేణుక నర్సింలు కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈఈ మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, నాయకులు పట్లోళ్ల విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం ఉమ్మడి పుల్కల్ మండలాధ్యక్షుడు పట్లోళ్ల మానిక్ రెడ్డి ఉన్నారు. 

టీఆర్​ఎస్​ నుంచి  కాంగ్రెస్ లో చేరికలు

మెదక్ (రేగోడ్), వెలుగు : టీఆర్ఎస్​పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర​ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఇందులో రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి  చెందిన  పీఏసీఎస్​ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, సీనియర్​ నాయకులు బండారి మల్లేశం, యాదయ్య ఉన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దామోదర పిలుపునిచ్చారు. 

నారాయణ్ ఖేడ్ బంద్ సక్సెస్

నారాయణ్ ఖేడ్, వెలుగు  : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నిరసిస్తూ  ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా పార్టీ లీడర్లు మాట్లాడుతూ రాజా సింగ్ పై పీడీ యాక్ట్  నమోదు చేయడం సరికాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్ ను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

కొనసాగిన వినాయక నిమజ్జనం

మెదక్, వెలుగు:  మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనం ఆదివారం కూడా కొనసాగింది. మెదక్​ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్​ శ్రీహరి, మార్కెట్​ కమిటీ చైర్మన్​ బట్టి జగపతితో కలిసి శోభాయాత్ర ప్రారంభించారు. నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు రాందాస్ చౌరస్తా వద్ద మున్సిపల్​ ఆధ్వర్యంలో స్వాగతం పలికగా, ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి మెమెంటోలు అందజేశారు. 

దుబ్బాకలో ఎమ్మెల్యే పూజలు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన గణేశ్​మండపాల్లో ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను కుల, యువజన  సంఘాల నాయకులు  శాలువాలతో ఘనంగా సన్మానించారు. 

మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్రు..

సదాశివపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు,  మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ  లీడర్, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రారావు అన్నారు. ఆదివారం సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట, ఆరూర్, అంకెనపల్లి, ఎల్లారం, ఆత్మాకూర్, బొబ్బిలింగాం గ్రామంలో  ప్రజాగోస బీజేపీ భరోసా బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ మోడీని ఎదుర్కోలేక ప్రజలకు అబద్దాలు చెబుతున్నారన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు.  రానున్న ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నియోజక వర్గం ఇన్​​చార్జి రాజేశ్వర్​ దేశ్​పాండే,  కోవూరు సంగమేశ్వర్,  వేణుమాధవ్, మాణికరావు,  తోట చంద్రశేఖర్, శ్రీశైలం సత్యనారాయణ, విజయ్  మండల పార్టీ అధ్యక్షుడు అంబదాస్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ దొంగల పార్టీ

కంగ్టి,వెలుగు : కాంగ్రెస్ దొంగల పార్టీ అని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక ఎంపీపీ ఆఫీస్ లో కొత్తగా మంజూరైన ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. పేదలకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా ఆ పార్టీలోని దొంగలు దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలలో, అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. త్వరలోనే సింగూరు నుంచి కంగ్టికి 8 టీఎంసీల సాగునీరు తెచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, కోట లలిత ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ నర్సమ్మ పాల్గొన్నారు.