గ్రేటర్ సిటీని ముంచెత్తిన వర్షం

గ్రేటర్ సిటీని ముంచెత్తిన వర్షం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాలుగు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్​ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్​ పూర్తిగా స్తంభించింది. మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో 8 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గ్రేటర్ సిటీని వర్షం ముంచెత్తింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. సాయంత్రం కొద్దిసేపు తెరిపిచ్చినప్పటికీ తర్వాత కుండపోత పోసింది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద పోటెత్తడంతో కంటోన్మెంట్​ పరిధిలోని రవి కాలనీకి వెళ్లో రోడ్డు కోతకు గురైంది. అటుగా రాకపోకలు నిలిచిపోయాయి. అత్యధికంగా ఏఎస్​రావు నగర్​లో 8.1, నేరెడ్​మెట్​లో 7.5, ఖైరతాబాద్​, సికింద్రాబాద్​లో​ 6.9, బంజారాహిల్స్​లో​ 6.4, కాప్రా 6.3 సెంమీల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వాన నీరు నిలిచింది. ప్రధాన సర్కిళ్లు, రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్​జామ్ ​అయ్యింది. మరో రెండ్రోజులు  వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్​గద్వాల్ విజయలక్ష్మి గురువారం జోనల్ కమిషనర్లు, వివిధ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో కాన్ఫరెన్స్​నిర్వహించారు. మాన్​సూన్ ఎమర్జెన్సీ టీంలను అలర్ట్​ చేయాలని సూచించారు. నిమజ్జనం రూట్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎగువ నుంచి వరద పెరగడంతో హిమాయత్​సాగర్ రెండు గేట్లను అడుగు మేర, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు.   - వెలుగు, సికింద్రాబాద్/గండిపేట