సిటీ హాట్ టాక్ : పెట్రోల్, డీజిల్ లేకపోతే బైక్స్, కార్లు ఎలా తీయాలి

సిటీ హాట్ టాక్ : పెట్రోల్, డీజిల్ లేకపోతే బైక్స్, కార్లు ఎలా తీయాలి

హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే టాక్.. పెట్రోల్, డీజిల్ అయిపోతుందంట.. వెంటనే వెళ్లి కొట్టించుకుందాం.. ఈ వార్తతో హైదరాబాద్ సిటీలోని ప్రతి పెట్రోల్ బంకు కిటకిటలాడుతుంది. వందల బండ్లు క్యూలో ఉన్నాయి. రేపటి నుంచి అంటే.. జనవరి 3వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదంట అంటూ వస్తున్న వార్తలతో.. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. మళ్లీ ఎప్పుడు ఆయిల్ దొరుకుతుందో అన్న భయంతో.. వాహనదారులు తమ బైక్స్, కార్లలో ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు. దీంతో బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టాల్లో సవరణలు చేసింది. అందులో హిట్ అండ్ రన్ కేసు ఒకటి. గతంలో ట్రక్కులు, లారీలు, బస్సులు, కార్లు ఇలా ఏ వాహనం అయినా యాక్సిడెంట్ అయితే.. అది హిట్ అండ్ రన్ కేసు అయితే పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ వచ్చేది. అదే విధంగా శిక్షలు కూడా తక్కువగా ఉండేవి.. చట్ట సవరణతో హిట్ అండ్ రన్ కేసు తీవ్రత పెరిగింది. 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ చట్టం వల్ల ట్రక్కు, లారీ, బస్సు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. తప్పు ఎవరిదైనా శిక్ష మాకే పడుతుంది అంటూ.. ట్రక్కు, లారీ, బస్సు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ నుంచి ఆయిల్ ట్యాంకర్లు కూడా సమ్మెలోకి దిగుతామనే వార్తల క్రమంలో.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయ్యింది.. పెట్రోల్ కొరతకు దారి తీస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. 

ఆయిల్ ట్యాంకర్లు కూడా సమ్మె చేయబోతున్నారన్న వార్తలతో హైదరాబాద్ సిటీలో హైటెన్షన్ వచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గరకు వేలాది మంది తమ వాహనాలతో తరలివచ్చారు. దీంతో బంకులు అన్నీ కిటకిటలాడుతున్నాయి.. రోడ్లపైకి క్యూ లైన్లు రావటంతో.. ట్రాఫిక్ జాం అవుతుంది. బైక్స్, కార్లతో రద్దీ ఏర్పడింది. ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ అనటంతో.. బంకులు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా ఆటోవాలాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆటోల్లో కేవలం 10 లీటర్లు మాత్రమే పడతాయి.. అదనంగా క్యాన్లలో కొట్టించుకోవాలంటే.. బంకుల్లో బాటిళ్లు, క్యాన్లలో కొట్టటం లేదు. దీంతో తమ ఉపాధి పోతుందని భయపడుతున్నారు. 

హైదరాబాద్ సిటీ మొత్తం ఇప్పుడు పెట్రోల్ టాక్ నడుస్తుంది.. రేపటి నుంచి బైక్స్, కార్లు ఎలా తీయాలి అని..