
తరలిపోతున్నటేకు పట్టించుకోని ఆఫీసర్లు
ఆసిఫాబాద్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి విలువైన టేకు కలప తరలిపోతోంది. స్మగ్లర్లు ప్రతీ రోజు లక్షలాది రూపాయల విలువైన చెట్లను నరికి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో కలప స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపింది. అక్రమ దందా జరగకుండా ఆఫీసర్లు రెండేళ్లపాటు వరుసగా కేసులు నమోదుచేసి వెహికల్స్జప్తు చేశారు. దీంతో స్మగ్లర్లు స్మగ్లింగ్ దందాకు స్వస్తిపలికారు. ఆఫీసర్లు మళ్లీ పట్టించుకోకపోవడంతో దందా జోరుగా సాగుతోంది. కెరమెరి, జైనూర్, తిర్యాణి, బెజ్జూర్, పెంచికల్‌పేట, దహెగాం అడవిని ఇష్టమొచ్చినట్లు నరికి టేకు దుంగలను మంచిర్యాల, కరీంనగర్,హైదరాబాద్ తదితర ఏరియాలకు తరలిస్తున్నారు.
రెండు నెలల్లో రూ 8 లక్షల కలప పట్టివేత..
ఇటీవల కలప రవాణాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పందించిన ఆఫీసర్లు నామమాత్రంగా దాడులు నిర్వహించారు. రెండు నెలల వ్యవధిలో సుమారు రూ. 8 లక్షల కలపను పట్టుకున్నారు. 13 మంది స్మగ్లర్ల పై కేసులు పెట్టారు. కానీ.. ఇంటి దొంగలు కొందరు దాడుల సమాచారం ముందుగానే స్మగ్లరకు చేరవేస్తున్నట్లు తెలిసింది. దీంతో వారు అప్రమత్తమై చాటుమాటున ఎడ్లబండ్లు, బొలేరోలు, కార్లలో కలప తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 22న కర్జెళ్లి రేంజీ నుంచి కలప రవాణా అవుతున్నట్లు ఆఫీసర్లకు సమాచారం వెళ్లింది. సమాచారం స్మగర్లకు చేరడంతో ఎడ్లబండ్ల మీద రవాణా చేస్తున్న కలపను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆఫీసర్లమో రాత్రి పూట కావడంతో నిందితులు పారిపోయారని చెబుతున్నారు. అదే నెల 27న ఉట్నూర్ నుంచి ఆసిఫాబాద్ కు కలప రవాణా అవుతుండగా కెరమెరి ఘట్ వద్ద ఎఫ్ ఆర్ వో మజారొద్దీన్ పట్టుకున్నారు. ఈనెల 2న దహెగాం మండలం కర్జీ ఫారెస్ట్నుంచి రూ. 89 వేల విలువైన కలప తరలుతుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని చంద్రశేఖర్, బాబాజీ పై కేసు నమోదు చేశారు. ఈనెల 4న పెంచికల్‌పేట జడ్పీటీసీ సముద్రాల సరిత ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను సీజ్‌చేశారు. జడ్పీటీసీ భర్త రాజన్నపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ లీడర్ల అండదండలతోనే కలప అక్రమంగా రవాణా అవుతోందని ఆరోపణలు
వస్తున్నాయి.
అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
కలప అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్మగ్లింగ్ అరిట్టేందుకు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత. రెండు నెలల్లో ఎనిమిది వెహికిల్స్ పట్టుకున్నాం. 14 మందిపై కేసులు నమోదు చేశాం.- దినేశ్‌కుమార్, డీఎఫ్‌వో, ఆసిఫాబాద్
అందుబాటులోకి వైద్యవిద్య
మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈప్రాంత విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చెప్పారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సంవత్సరం అడ్మిషన్లు జరిగేలా, కాలేజీకి పర్మిషన్ వచ్చేలా కృషి చేశామన్నారు. తాత్కాలిక ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గురుకుల క్రీడా పోటీలకు ఏర్పాటు చేయండి
నార్నూర్, వెలుగు: రాష్ట్ర స్థాయి గురుకుల క్రీడా పోటీలకు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఉట్నూర్ మండలం లాల్ టేకిడి గురుకుల పాఠశాలలో ఈనెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్న ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రస్థాయి గురుకుల క్రీడాపోటీల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, భోజన వసతి కల్పించాలన్నారు. బందోబస్తు ఏర్పాటు పోలీసు ఆఫీసర్లను కోరారు. కార్యక్రమంలో ఆర్ పీ వో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
దండేపల్లి, వెలుగు: వెల్గనూర్ నుంచి ముత్యంపేట, కొర్విచెల్మ మీదుగా లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం వరకు పీఎంజీఎస్‌వై ఫండ్స్ రూ.5.63 కోట్లతో నిర్మించిన రోడ్డును ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. కొండాపూర్‌లో దేవాదాయ శాఖ నిధులు రూ.19.46 లక్షలతో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తహసీల్దార్ ఆఫీసులో 46 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. రైతుబంధు కమిటీ అధ్యక్షుడు గురువయ్య, తహసీల్దార్ హనుమంతరావు, ఎంపీడీవో మల్లేశ్, ఎంపీపీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ లింగన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీసీ లీడర్లపై కేంద్ర ప్రభుత్వ తీరు బాగాలేదు
ఆదిలాబాద్,వెలుగు: దేశంలో లక్షల కోట్లు దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులపై చర్యలు తీసుకోలేని కేంద్ర ప్రభుత్వం, బీసీ లీడర్లపై మాత్రం ఈడీ దాడులు చేయించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. గురువారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్రలపై ఈడీ దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఎన్ని రకాల అడ్డంకులు సృష్రించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ సంస్థలుగా మారాయన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, కార్యదర్శి అష్రఫ్, రైతు సమన్వయ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అట్టహాసంగా క్రికెట్ పోటీలు ప్రారంభం
బెల్లంపల్లి,వెలుగు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో అండర్–25 జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు గురువారం బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీసీఐ స్టేట్ సెక్రటరీ దరం గురువారెడ్డి, జోనల్ చైర్మన్ వివేకనందా రెడ్డి, సెక్రటరీ జైపాల్ పోటీలను ప్రారంభించారు. టోర్నీలో మొత్తం ఎనిమిది జిల్లాల జట్లు పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో టీసీఐ జిల్లా కో ఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, జిల్లా క్రికెట్ కోచ్‌లు జాడి శేఖర్, అల్లం గౌతం, ప్రణీత్ కుమార్, పైడిమల్ల నర్సింగ్, ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కిట్ల పంపిణీ
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగంలో నూతన సంస్కరణలు అమల్లోకి తెచ్చిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ చెప్పారు. గురువారం పుత్లీ బౌలి ఆరోగ్య కేంద్రంలో బాధితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రధాని సభను చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్
నిర్మల్,వెలుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే ప్రొగ్రామ్‌ను చూసేందుకు నిర్మల్ లో బీజేపీ లీడర్లు ఎల్ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, ప్రజలు స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్‌కు వచ్చి కార్యక్రమం చూడొచ్చని ఆ పార్టీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ పడిపెల్లి గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ రాజు, లీడర్లు డాక్టర్ మల్లికార్జున రెడ్డి, అలివేలు మంగ, శ్రావణ్ రెడ్డి, మురళీధర్, బరుకుంట నరేందర్ తదితరులు ఉన్నారు.
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రిలీజ్ చేశారు. జిల్లాలో మొత్తం 65 లక్షల 9 వేల177 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో 33 లక్షల 9 వేల 994 మంది మహిళలు, 31 లక్షల 9 వేల189 మంది పురుషులు ఉన్నారన్నారు. ఇతరులు 44 మంది ఉండగా 931 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 8వరకు తెలపాలన్నారు. కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయండి
ఖానాపూర్,వెలుగు: నిర్మల్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు రావాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జీవీ నర్సింహారెడ్డి కోరారు. గురువారం ఖానాపూర్ ఎంపీపీ ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ శర్మ, కేవీఐసీ విజయలక్ష్మి, డీపీఎం సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
25న పీడీఎస్‌యూ మహాసభలు
నిర్మల్,వెలుగు: నిర్మల్‌లో ఈనెల 25 న పీడీఎస్ యూ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, వాగ్మారే మహేందర్ తెలిపారు. గురువారం వారు స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మహాసభల కరపత్రాలు రిలీజ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పేదలకు విద్య అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ట్రైబల్వర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు విశాల్, కిరణ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి
నిర్మల్,వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని మార్కెట్‌కమిటీ చైర్మన్ చిలుక రమణ సూచించారు. గురువారం స్థానిక వెంగ్వాపేటలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. తూకం, తేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పోడు సమస్య పరిష్కరించాలి
ఖానాపూర్,వెలుగు: పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీపీఎం లీడర్లు కోరారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి గుంజుకున్న భూములు తిరిగి ఇచ్చేయాలన్నారు. లీడర్లు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేశ్, డాకూర్తిరుపతి, పోష లింగు, నల్ల అశోక్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్‘సార్’
జైనూర్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం టీచర్‌గా మారారు. మార్లవాయి ఆశ్రమ పాఠశాలను విజిట్ చేసి పదోతరగతి విద్యార్థులకు మ్యాథ్స్చెప్పారు. సులువైన పద్ధతిలో లెక్కలు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. టీచర్లు స్టూడెంట్లతో ఫ్రెండ్లీగా ఉంటూ డౌట్లు క్లీయర్ చేయాలన్నారు. అనంతరం స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభుదయ, సర్పంచ్ ప్రతిభావెంకటేశ్, ఐకేపీ ఏపీఎం సుజాత, ఐటీడీఏ ఏఈ ఇందలసింగ్, హెచ్ ఎం నీలాకాంతరావు తదితరులున్నారు.
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
ఆదిలాబాద్,వెలుగు: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా చెప్పారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా సైనిక బోర్డు సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల కుటుంబాలు, మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం రకరకాలు సబ్సిడీ పథకాలు అందిస్తుందన్నారు. ఆర్థిక సహకారం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సైనిక సంక్షేమ శాఖ రిటైర్డు డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ మాట్లాడుతూ మాజీ సైనికుల వివరాలు ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల నుంచి ఫ్లాగ్ డే ఫండ్స్ వసూలు చేసి వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. పిల్లలకు ఉన్నత విద్య, వివాహాలు, ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. అనంతరం మరణించిన 8 మంది సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు, ఆర్డీవో రమేశ్ రాథోడ్, యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
ఘనంగా వెంకన్న ఆలయ స్వర్ణోత్సవాలు
మందమర్రి,వెలుగు: మందమర్రి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాత్రి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఆరు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటిరోజు లక్ష్మీనారాయణ యాగంలో భాగంగా పంచముఖి హనుమాన్ ఆలయం నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల కోలాటం, మంగళహారతుల మధ్య ప్రత్యేక వాహనంపై త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామికి ఆహ్వానం పలికారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్-లక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ పనులు త్వరగా పూర్తిచేయాలి
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లిలోని పాత కూరగాయల మార్కెట్ స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గ్రేటెడ్ మార్కెట్పనులు త్వరగా పూర్తి చేయాలని కూరగాయాల వ్యాపారులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పాత జీఎం ఆఫీస్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఫలితంగా రోడ్లపై వ్యాపారం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్వ్యాపారులతో మాట్లాడి పనులు స్పీడప్ చేయిస్తామన్నారు. దీంతో వ్యాపారులు ఆందోళన విమరించారు.