
హైదరాబాద్ లో గురువారం ( సెప్టెంబర్ 25 ) అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా.. మియాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మంగళ వెళ్లే రూట్లో రైల్వే అండర్ పాస్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మియాపూర్ పరిసర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారు ఎక్కువగా ఈ రూట్లోనే వెళ్తుంటారు. నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటం, ఉదయం కాస్త గ్యాప్ ఇవ్వగానే ఒక్కసారిగా ఆఫీసులకు బయలుదేరారు.. దీనికి తోడు అండర్ పాస్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒకవైపు ఆన్ అండ్ ఆఫ్ వర్షం, మరోవైపు ముందుకు కదలనివ్వని ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బంది పడుతున్నారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం, శనివారం ( సెప్టెంబర్ 26, 27 ) కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమాంలో.. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సూచించారు సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది తలెత్తకుండా.. ఈమేరకు సూచనలు చేశారు పోలీసులు.
అర్ధరాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీములు అప్రమత్తమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టాయి. రాబోయే రెండు గంటల పాటు హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.