ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మరింత విస్తరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

 ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మరింత విస్తరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మరింత విస్తరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్​లో ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

వెనుకబడిన తరగతుల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు రుణ మంజూరులో ఆలస్యం చేయొద్దన్నారు. అర్హులైన వారికి తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. విస్తృత అవగాహన ద్వారానే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.