ఒక్క రోజే 31 గుడ్లు పెట్టిన కోడి

ఒక్క రోజే 31 గుడ్లు పెట్టిన కోడి

కోడి ఏ బ్రీడ్ కు చెందినదైనా రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మరీ అరుదుగా రెండు గుడ్లు పెడుతుంది. కానీ ఓ కోడి మాత్రం ఒక్కరోజు వ్యవధిలో 31గుడ్లు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఓ కోడిపెట్ట రోజులో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. సాధారణంగా కోళ్లు పురుగులను తింటాయి. ఈ కోడి మాత్రం వాటి జోలికి వెళ్లదు. పల్లీలు, వెల్లుల్లి మాత్రమే తింటుంది. కోడికి ఇప్పటి వరకు ఎలాంటి జబ్బు రాకపోవడం విశేషం.

రోజులో 31 గుడ్లు పెట్టిన ఈ కోడిని గిరీష్ చంద్ర బుధాని అనే వ్యక్తి పెంచుకుంటున్నారు. అల్మోరా జిల్లాలోని భికియాసైన్ తహసీల్‌లోని బసోత్ గ్రామంలో నివసిస్తున్న ఆయన.. కోళ్లను కూడా తన పిల్లల్లాగే చూసుకుంటారు. కొన్నాళ్ల క్రితం రూ.200లకు రెండు కోడి పిల్లలను కొన్న గిరీష్.. వాటిని ఇంటి సభ్యులుగా సాకడం మొదలుపెట్టాడు. 

డిసెంబర్ 25న గిరీష్ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి కోడి 5 గుడ్లు పెట్టిందని అతని పిల్లలు చెప్పారు. అది విన్న గిరీశ్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కోడి ప్రతి 10,-15 నిమిషాలకు ఒక గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. అలా మొత్తం 31 గుడ్లు పెట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు. దీంతో కోడికి ఏదైనా వ్యాధి సోకిందేమోనని గిరీష్ భావించారు. డాక్టర్ దగ్గరకు వెళ్లగా కోడికి ఎలాంటి రోగం లేదని నిర్థారించడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అయితే గిరీష్ కోడి 31 గుడ్లు పెట్టిన విషయం చుట్టుపక్కల తెలియడంతో దాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన కోడి పేరు నమోదయ్యేలా గిరీష్ ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు.