
ఒక పక్క చలికి దగ్గు, జలుబు, రకరకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు. మరో వైపు కరోనా థర్డ్ వేవ్. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి సహజం. కానీ, భయపడుతూ కూర్చుంటే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఈ సిచ్యుయేషన్స్‌ని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మైండ్‌తో పాటు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేసుకోవాలి అంటున్నారు జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ సుష్మ పిఎస్. అందుకోసం కొన్ని టిప్స్ చెప్తున్నారామె. ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే.. ఒకవేళ చిన్నాచితకా హెల్త్ ఇష్యూస్ వచ్చినా అవి బాడీని పెద్దగా ఎఫెక్ట్ చేయలేవు. అందుకే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అందుకోసం బ్యాలెన్స్డ్ డైట్‌ని ఫాలో అవ్వాలి. అయితే ఇమ్యూనిటీ అనగానే బెర్రీస్, చియా, సన్‌ఫ్లవర్ సీడ్స్ లాంటివే అనుకుంటారు. కానీ, వంటింట్లోనూ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. మనం రోజూ తినే వంటకాలు, దేశవాళీ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో పాటు ప్రొటీన్, విటమిన్– సి, డి, ఇ, జింక్, ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అన్నీ ఇమ్యూనిటీ బూస్టర్సే.
ప్రొటీన్ రిచ్
మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనది ప్రొటీన్. ఇది బాడీలో బిల్డింగ్ బ్లాక్‌లా పనిచేసి డ్యామేజ్ అయిన సెల్స్‌ని రిపేర్ చేస్తుంది. అందుకే ప్రతిరోజూ శరీర బరువుని బట్టి (కిలోకి 0.8 గ్రాముల చొప్పున) ప్రొటీన్ తీసు కోవాలి. ఇప్పుడున్న కొవిడ్ పరిస్థితుల్లో ఆ ప్రొటీన్ క్వాంటిటీని పెంచాల్సిందే. అందుకోసం చికెన్, చేపలు, కోడిగుడ్లతో పాటు బీన్స్, నట్స్, చిరుధాన్యాల్ని డైట్లో చేర్చాలి. అలాగే ప్రతిరోజూ మిల్క్ ప్రొడక్ట్స్‌ని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
విటమిన్–సి
విటమిన్– సి కణాల్ని రిపేర్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్ల ఎంజైమెటిక్ ఉత్పత్తికి సాయ పడుతుంది. ఎంజైమ్స్ ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని రీచార్జ్ చేస్తుంది. దానివల్ల జలుబు, దగ్గు నుంచి తక్కువ టైంలోనే రిలాక్సేషన్ వస్తుంది. అందుకే సంత్రా, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివి, జామ, బొప్పాయి, క్యాప్సికం, బ్రకోలి, ఉసిరి లాంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. రోజుకి 40 మిల్లీగ్రాముల సిట్రస్‌ను శరీరానికి ఇవ్వాలి.
విటమిన్–ఎ & డి
విటమిన్–ఎకి స్కిన్ ఫ్రెండ్లీ విటమిన్‌గా పేరుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్లని దరిచేరనివ్వదు. నోరు, పొట్ట, పేగులు, శ్వాస కోశ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ విటమిన్. అందుకే విటమిన్– ఎ ఎక్కువగా ఉండే మొరం(గెనుసు) గడ్డ, ఆకుకూరలు, బ్రకోలి, క్యారెట్స్, ఆప్రికాట్స్ని రెగ్యులర్ డైట్లో భాగం చేయాలి. అలాగే విటమిన్–డి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచి, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు రిలీజ్ అవ్వకుండా చూస్తుంది. సాల్మన్ చేపలు, కోడి గుడ్డు సొన, చీజ్, పెరుగు, ఆరెంజ్ జ్యూస్, టోఫూలో ఇది ఎక్కువగా ఉంటుంది. రోజులో 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉన్నా విటమిన్–డి సరిపడా అందుతుంది.
ఐరన్
బాడీ ఫంక్షనింగ్కి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్‌లో ఐరన్ ఒకటి. ఇది ఇమ్యూనిటీ సెల్స్ పనితీరుని మెరుగుపరుస్తుంది. చర్మంతో పాటు జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే ఐరన్ రిచ్ ఫుడ్ అంటే మాంసంతో పాటు కర్జూరం, ముల్లంగి ఆకులు, పాలకూర, బెల్లం, తృణధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవాలి.
విటమిన్–ఇ
విటమిన్–ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీరాడికల్స్ నుంచి కణాల్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, వయసు సంబంధిత జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే విటమిన్–ఇ ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్, అవకాడో, వెజిటబుల్ ఆయిల్స్, పీనట్ బటర్ని ఎక్కువగా తీసుకోవాలి. జింక్ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్కి సాయ పడుతుంది. జలుబు, దగ్గు తీవ్రతని తగ్గిస్తుంది. పాలు, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్స్‌లో ఇది ఎక్కువ. వీటన్నింటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉన్న పసుపుని ఎక్కువగా వాడాలి. రోజుకి ఒక టీ స్పూన్ పసుపుని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎలాంటి జబ్బులు దరిచేరవు.