
- భూములను తీసుకుని ఫెన్సింగ్ వేసిన గత సర్కార్
- ఆరేండ్లుగా పరిహారం ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం
- సర్వే నంబర్లలో తప్పులకు పరిష్కారం చూపని ధరణి
- మార్పు చేసే అధికారం లేదని తేల్చి చెప్పిన ఆఫీసర్లు
- ఆఫీసులు, లీడర్ల చుట్టూరా తిరిగి అలసిపోయిన రైతులు
- భూభారతి చట్టంతో స్వాల్ చేయాలని నిర్వాసితుల వేడుకోలు
వరంగల్, వెలుగు: వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్) కోసం గత సర్కార్ రైతుల నుంచి భూములు గుంజుకుంది. పేపర్ ప్రకటన ఇవ్వడమే కాకుండా నెలలోపే పరిహారంపై హామీ ఇచ్చింది. ఆ వెంటనే భూములను సేకరించి ఫెన్సింగ్ పెట్టింది. అధికారులేమో పరిహారం ఇచ్చేందుకు నిధులు లేవని తేల్చి చెప్పారు. మరోవైపు నోటరీ, వారసత్వ భూములకు హక్కుదారుగా రికార్డుల్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. అయితే.. ధరణి చట్టంలో అలాంటి సవరణలు చేసేందుకు తమకు అధికారం లేదని తేల్చి చెప్పారు.
ఇలా ఐఆర్ఆర్ కింద రైతులు భూములు కోల్పోయి మే 2న నాటికి ఆరేండ్లు అయింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆరిగోస పడుతుండగా.. ఇంకా పరిహారం అందలేదు. భూములు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. సాగు చేసుకుందామంటే భూముల్లేక.. మరేదైనా పని చేసుకుందామంటే పరిహారం డబ్బులు అందక వందలాదిమంది రైతులు మానసికంగా కుంగిపోయారు.
15 ఏండ్ల కింద ఐఆర్ఆర్ చేపట్టగా..
హైదరాబాద్, కరీంగనగర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఖమ్మం మీదుగా వచ్చే భారీ వాహనాలు వరంగల్, హనుమకొండ సిటీలోకి రాకుండా దారి మళ్లించేలా అప్పటి ప్రభుత్వం 2010లో ఐఆర్ఆర్ కు శ్రీకారం చుట్టింది. దీనికి నిధులు సమకూర్చే బాధ్యత కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా)కు ఇచ్చింది. రోడ్డు నిర్మాణ పనులు ఆర్అండ్ బీకి అప్పగించింది. 1972 మాస్టర్ ప్లాన్ ఆధారంగా 200 అడుగుల రోడ్డుకు అధికారులు ప్రతిపాదించారు.
ఇందుకు 89.36 ఎకరాల భూమి కావాల్సి ఉండగా, ఇందులో 60 –70 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అవసరమైంది. దీంతో 2012లో భూసేకరణకు రూ.20 కోట్లను ప్రభుత్వం కేటాయిం చింది. తొలి దశలో రంగశాయిపేట, నాయుడు పెట్రోల్ పంప్ నుంచి గవిచర్ల క్రాస్ రోడ్, స్తంభంప ల్లి, జానీ పీరీలు, కీర్తినగర్, ఏనుమాముల, పైడిపల్లి, కొత్తపేట, ఆరేపల్లి దామెర జంక్షన్ వద్దకు 8 కిలోమీటర్ల నిర్మాణాని కి ప్రపోజల్స్ రూపొందించారు. రూ.50 కోట్లతో 25 ఎకరాల సేకరణ పూర్తయినట్లు, మిగతా 40 ఎకరాలను ఒకేసారి సేకరిస్తామని అధికారులు చెప్పారు.
పరిహారం ఇవ్వకుండానే ..
ఐఆర్ఆర్ కోసం ‘ కలెక్టర్ G1/23/2019 & RDO ఫైల్ నంబర్ F/02/2019 భూసేకరణ’ పేరుతో 02.05.2019లో పేపర్ ప్రకటన ఇచ్చారు. రైతుల వద్ద అధికారులు భూములు గుంజుకుని, పరిహారం ఇవ్వకుండానే కుడా ఆధ్వర్యంలో ఆ భూముల్లో ఫెన్సింగ్ వేశారు. ఆపై బాధిత రైతులు ఎలాంటి పనులు చేయకుండా మొక్కలు నాటారు.
దీంతో అప్పటి నుంచి ఏనుమాముల, చింతల్, దూపకుంట, ఖిలావరంగల్ కు చెందిన బాధిత రైతులు నష్టపరిహారం కోసం కుడా, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చివరకు పరిహారం అందకపోవడంతో పాటు సొంత భూములపై హక్కులు కూడా కోల్పోయారు.
రూ.50 కోట్లు ఇవ్వని గత సర్కార్
ఐఆర్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూములను తీసుకునే క్రమంలో ‘కుడా’ భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం డబ్బును ‘ఓసీటి’ ప్లాట్ల ఆదాయం, ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే నిధులను ఖర్చు చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఆర్డీఓ పేరుతో రూ.150 కోట్లు డిపాజిట్ చేశారు. రెవెన్యూ అధికారులు అవి చాలవని.. మరో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు అవసరమని తేల్చిచెప్పారు.
కాగా, గత బీఆర్ఎస్ సర్కార్ ఆ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ఇంతలో ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు గజం రూ.3 వేల నుంచి రూ.5 వేలలోపు ఉంటే.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంది.
ధరణిలో మార్పులు చేసే అధికారం లేదని..
ఐఆర్ఆర్కు భూములు ఇచ్చిన రైతులకు తమ వారసత్వంగా వచ్చాయి. నిర్వాసితుల్లో దాదాపు 250 మందికి పైగా ఉంటే..ఇందులో 200 మంది వరకు ఇవే. కాగా, గత బీఆర్ఎస్ సర్కారు పరిహారం ఇచ్చేందుకు నిధులు లేవని చెప్పింది. నోటరీ, వారసత్వ, సర్వే నంబర్లు తప్పుగా ఉన్నవాటిని పట్టాదారుగా సరిచేయాల్సి ఉందని స్పష్టంచేసింది. తమ భూ రికార్డుల్లోని తప్పుల సవరణకు రైతులు ఓకే చెప్పారు.
అయితే..ధరణిలో మార్పులు చేసే అధికారం తమకు లేదని అధికారులు చేతులెత్తేశారు. మొత్తంగా భూములు కోల్పోయిన రైతులు సాగు చేసుకునేందుకు లేకపోగా.. పరిహారం రాకపోగా.. తమ పిల్లల చదువులు, పెండ్లిళ్ల కోసం డబ్బుల్లేక ఆర్థికంగా దెబ్బతిన్నారు.
‘భూభారతి’తో పరిష్కారం చూపాలని..
కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ.. మామునూర్ ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి మేజర్ ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉండడంతో త్వరగా ఐఆర్ఆర్ పనులు పూర్తి చేసేందుకు ప్రయారిటీ ఇచ్చింది. ఐదున్నరేండ్లుగా ఉన్న నిధుల సమస్యకు పరిష్కారం చూపుతూ రూ.120 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భూ బాధితులకు అవసరమైన ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
కానీ.. నోటరీ, వారసత్వ, సర్వే నంబర్లను భూ రికార్డుల్లో సవరించాల్సి ఉంది. అయితే.. ఇన్నాళ్లు ధరణితో ఆగిపోయాయి. ప్రస్తుతం భూభారతి చట్టంతో కలెక్టర్, ఆర్డీఓల పరిధిలో పరిష్కారం చూపే చాన్స్ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఐఆర్ఆర్ కు ఇచ్చిన రైతుల భూముల సమస్యలపై ఫోకస్ పెట్టి తొలి ప్రాధాన్యతగా పరిష్కరించారు. అదేవిధంగా త్వరగా తమకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయినం
ఏండ్లుగా పరిహారం అందపోతుండగా ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయినం. ఇప్పుడు మా భూములకు ఎంతో డిమాండ్ వచ్చినా అభివృద్ధి కోసం సహకరిస్తున్నాం. ప్రస్తుత సర్కార్, అధికారులు స్పందించి భూభారతితో మా భూ సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
గంగుల దయాకర్, బాధితుడు
ఆరేండ్లుగా అరిగోస పడుతున్నాం
ఇన్నర్ రింగ్ రోడ్ కోసం మా భూములు గుంజుకోని.. నెలలోపే పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆరేండ్లుగా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అరిగోస పడుతున్నాం. మా భూములను సాగు చేసుకోకుండా కంచె వేశారు. ఎన్నోసార్లు ధర్నాలు, నిరసనలు చేశాం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలే.-
జంగం రాజనర్సు, బాధితుడు