
వాక్కాయ.. చూడటానికి ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలిసి ఉన్న వీటితో పప్పు, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. కొరికి చూస్తే.. ఉసిరికాయలాగ పుల్లగా ఉంటుంది. కానీ, వంటల్లోవాడితే దీని రుచే వేరు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఔషధగుణాలు ఉన్న ఈ వాక్కాయలతో నాన్ వెజ్ వెరైటీలు బోలెడు చేసుకోవచ్చు. అందులో ఈ మూడూ ప్రత్యేకం. రొయ్యలు, చేపలు, మటన్.. వీటిలో దేనికైనా వాక్కాయల కాంబినేషన్‌తో వండితే టేస్ట్ అదిరిపోవాల్సిందే. మరి ఇంకెందుకాలస్యం.. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రెసిపీలు ఓసారి ట్రై చేయండి.
వాక్కాయ-రొయ్యలు కావాల్సినవి:
- వాక్కాయలు – పావు కిలో
- పచ్చిరొయ్యలు – అర కిలో
- పసుపు – అర టీస్పూన్
- కారం – మూడు టీస్పూన్లు
- నూనె, ఉప్పు – సరిపడా
- పచ్చిమిర్చి – నాలుగు
- ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
- కొత్తిమీర – కొంచెం
తయారీ: వాక్కాయల్ని శుభ్రంగా కడిగి, నాలుగు ముక్కలుగా కట్ చేసి గింజల్ని తీసేయాలి. శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని గిన్నెలో వేసి, అందులో పసుపు, కారం, నూనె వేసి బాగా కలపాలి. అలా కలిపిన వాటిని కడాయిలో వేసి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. నీళ్లన్నీ ఇంకిపోయాక వాటిని పక్కన తీసి పెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత వేగించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత పసుపు వేసి కలిపి, మూతపెట్టి ఉడికించాలి. నూనె తేలాక వాక్కాయ ముక్కల్ని కూడా వేసి కలిపి మరికాసేపు ఉడికించాలి. ఆ తర్వాత కారం, కొత్తిమీర వేసి నీళ్లు పోసి మూతపెట్టాలి. ఆ మిశ్రమం దగ్గర పడేవరకు ఉడికిస్తే.. కూర తయారైనట్టే.
చేపల పులుసు కావాల్సినవి :
- చేప ముక్కలు – ఒక కిలో
- వాక్కాయలు – పావు కిలో
- అల్లం – వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్
- నూనె, ఉప్పు, నీళ్లు – సరిపడా
- కారం – రెండు టీస్పూన్లు
- పసుపు – ఒక టీస్పూన్
- పచ్చిమిర్చి – రెండు
- గసగసాలు – కొబ్బరి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర, కరివేపాకు – కొంచెం
- జీలకర్ర – ఉల్లిగడ్డ పేస్ట్ – అర కప్పు
తయారీ: వాక్కాయలను కడిగి, ముక్కలు చేయాలి. చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి శుభ్రంగా కడగాలి. గసగసాలు, కొబ్బరి కలిపి గ్రైండ్ చేయాలి. పాన్‌లో చేప ముక్కలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర – ఉల్లిగడ్డ పేస్ట్, గసగసాలు – కొబ్బరి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి ముక్కలకు బాగా పట్టించాలి. తర్వాత కరివేపాకు, వాక్కాయ ముక్కలు వేసి దాదాపు అరలీటరు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత సిమ్‌లో పావుగంటసేపు ఉడికించాలి. కొత్తిమీర చల్లాలి.
మటన్ కూర కావాల్సినవి:
- మటన్ – అర కిలో, వాక్కాయలు – ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
- కారం – మూడు టీస్పూన్లు
- ఉప్పు, నూనె – సరిపడా
- పసుపు – అర టీస్పూన్, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- ధనియాల పొడి – ఒక టీస్పూన్
- గరం మసాలా, మటన్ మసాలా – అర టీస్పూన్
- పచ్చిమిర్చి – మూడు
- వేడి నీళ్లు – కొన్ని
తయారీ: ఒక గిన్నెలో మటన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి గంటసేపు పక్కన పెట్టాలి. వాక్కాయల్ని ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తర్వాత మటన్ వేసి కలిపి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. అందులో నీళ్లు పోసి మరో పావు గంట ఉడికించాలి. మటన్ ఉడికాక వాక్కాయ ముక్కలు, కొత్తిమీర, మటన్ మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. వాక్కాయలు ఉడికాక గరం మసాలా వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత వాక్కాయ మటన్ కర్రీ తినేయొచ్చు.