
హుజూర్‌నగర్, వెలుగు : టెర్రరిజం ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా.. దానిని అంతం చేయాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం జరిగిన స్వాతంత్ర్య సమరయోధురాలు, సైదా రైతాంగ పోరాట యోధురాలు పశ్య కన్నమ్మ సంతాప సభలో ఆయన మాట్లాడారు. కశ్మీర్‌లో అమాయకులను బలి తీసుకున్న టెర్రరిస్ట్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి టెర్రరిస్టులను అంతం చేయాలని కోరారు. ఎన్నికల ముందు దేశంలో టెర్రరిస్ట్ దాడులు జరగడం పరిపాటిగా మారిందని.. టెర్రరిజాన్ని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకోవడం ఆటవిక సంప్రదాయమన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కమ్యూనిస్టులకే ఉందన్నారు. ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రసుత్తం జరుగుతున్న యుద్ధాలన్నీ వ్యాపార యుద్ధాలే అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, అక్కినేని వనజ, జాతీయ మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి రజని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, రైతాంగ పోరాట నాయకుడు దొడ్డ నారాయణరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు పాల్గొన్నారు.