సంక్రాంతికని ముందే ఫిక్సయ్యాం!

సంక్రాంతికని ముందే ఫిక్సయ్యాం!

‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో బంగార్రాజుగా మెప్పించిన నాగార్జున.. ఇప్పుడా మూవీ సీక్వెల్‌‌తో వస్తున్నారు. నాగచైతన్య చిన ‘బంగార్రాజు’గా నటించిన ఈ చిత్రం ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా నాగ్‌‌ చెప్పిన విశేషాలు.   

‘విలేజ్‌ పాత్రల్లో పొగరుబోతుదనం ఉంటుంది. అది, ఆ భాష, యాస నాకు చాలా ఇష్టం. ఇండియన్స్‌‌కి ఆత్మలుంటాయనే నమ్మకం ఉంది. అవి నిజంగా ఉంటాయో లేదో నాకైతే తెలీదు. కానీ ఎవరైనా చెబుతుంటే శ్రద్ధగా వినేవాడిని. రాత్రి నిద్ర పట్టేది కాదు. ఈ కథ చెప్పినప్పుడు కూడా అదే నచ్చింది. వర్కవుటయింది. సోగ్గాడేలో యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ మిస్సయ్యాం. ఆ ఎనర్జీని  ఇందులో చూడొచ్చు. గతేడాది  ఆగస్టు 25న షూట్ స్టార్ట్ చేశాం. సంక్రాంతికి రావాలని ముందే ఫిక్సయ్యాం. అలా వస్తేనే షూట్ చేద్దాం లేదంటే నెక్స్ట్ పండగకి ప్లాన్ చేసుకుందాం అన్నాను. టీమ్ సపోర్ట్‌‌ చేస్తామని చెప్పడంతో ముందుకు సాగాం. అందులో కొడుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కిందికొస్తే.. ఇప్పుడు మనవడి సమస్య తీర్చడానికి వస్తాను. తెలుగు సినిమాల్లో బ్లడ్ రిలేషన్స్ ఎక్కువ వర్కవుటవుతాయి. ‘మనం’ విషయంలో అది ప్రూవ్ అయ్యింది. నేను సినిమా అంతా ఉంటాను. కానీ ఆత్మలా లోపలికి వెళ్లినప్పుడు నన్ను చూపించలేరుగా? అందుకే చైతునే ఎక్కువగా కనిపిస్తాడు. సినిమా సక్సెస్ అయితే ప్రొడక్షన్ పరంగా క్రెడిట్ నేను తీసుకుంటాను. యాక్టింగ్ పరంగా తనకి వస్తుంది. అద్భుతంగా నటించాడు. ఈ ప్రాజెక్టులోకి వచ్చే ముందు సోగ్గాడే సినిమా నాలుగైదుసార్లు చూడమని చైతూతో చెప్పాను. తనలోకి సీనియర్ బంగార్రాజు ఆత్మ ఎంటరయిన తర్వాత మాడ్యులేషన్ మారుతుంది. ఆ డైలాగ్స్ రికార్డ్ చేసి ఇచ్చేవాణ్ని. దాన్ని ఫాలోఅయిపోయాడు’ అని నాగార్జున అన్నారు. 

‘వాసివాడి తస్సాదియ్యా పాట కళ్యాణ్‌ కృష్ణ రాశాడు. పాటలో బిగినింగ్ వర్డ్స్ డబ్బింగ్ చెబుదామని వెళ్తే.. అనూప్​తో కలిసి ప్లాన్‌‌ చేసి నాతోనే పాడించేశాడు. అనూప్ రూబెన్స్ ‘సోగ్గాడే’ కంటే దీనికి  బెటర్ మ్యూజిక్‌‌ ఇచ్చాడు. కలెక్షన్స్ విషయంలో వర్కవుటవుతుందా లేదా అని మాత్రమే ఆలోచించి సినిమా రిలీజైనా నాకేమీ ప్రాబ్లమ్ లేదని చెప్పాను. రేట్లు పెరిగితే బోనస్‌‌. లేదంటే సేఫ్‌‌. ఏపీలో నైట్ కర్ఫ్యూని పండగ తర్వాతకి వాయిదా వేయడం మాకు అడ్వాంటేజ్ అయ్యిందనే చెప్పాలి’ అని నాగ్ పేర్కొన్నారు.