నాకు కంఫర్ట్ జోన్ అనేదే లేదు : నాని

నాకు కంఫర్ట్ జోన్ అనేదే లేదు :  నాని

‘దసరా’ లాంటి మాస్‌‌ సినిమా తర్వాత ‘హాయ్‌‌ నాన్న’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నాని. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు.  ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా బుధవారం హీరో నాని ఇలా ముచ్చటించాడు. 

ఇది చాలా హ్యాపీ మూవీ. సినిమా చూసిన ప్రేక్షకులు నవ్వుతూ బయటకు వస్తారు. ఆ సంతోషంలోనే మనసుని హత్తుకునే ఎమోషన్‌‌ ఉంటుంది. దర్శకుడు శౌర్యువ్ కథ  చెప్పినప్పుడే చాలా నచ్చేసింది. ఇక యష్ణ పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించింది. బేబీ కియారా నటన మనసుని హత్తుకునేలా వుంటుంది. 
బ్రిలియంట్ మెమొరీ. మా డైలాగులు కూడా చెప్పేస్తుంది. శ్రుతి హాసన్ ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంది.  


ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ మూవీస్‌‌ కావాల్సిన దానికంటే ఎక్కువ స్పైసీని పంచాయి. స్పైసీ తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. ఆ స్వీట్‌‌ని ఇచ్చే సినిమాలే లేవు. ‘హాయ్ నాన్న’ ఆ లోటుని తీరుస్తుంది. అందరికీ కనెక్ట్  అవుతుంది. గతంలో నాకు ‘సినిమా బాగుంటే చూస్తారు కానీ మనం చెబితే చూసేస్తారా’ అనే ఆలోచన ఉండేది.  ‘దసరా‘తో అది మారింది. ఒక మంచి సినిమా చేయడమే కాదు.. దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళితేనే ఆసక్తి పెరుగుతుందని ఆలోచన మొదలైంది. అందుకే ఈ సినిమాకి అగ్రెసివ్‌‌గా ప్రమోషన్‌‌ చేశా.


ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌లో నటిస్తే కామెడీ నా కంఫర్ట్ జోన్ అని, ‘జెర్సీ’ లాంటివి చేసినప్పుడు ఎమోషన్‌‌ కంఫర్ట్ జోన్ అని అన్నారు. నిజానికి నాకు కంఫర్ట్ జోన్ అనేదే లేదు. నేను ఏ సినిమాను ఇమేజ్ కోణంలో చూడను. కథలు నచ్చాయనే వెంటవెంటనే దసరా, హాయ్ నాన్న చిత్రాలు చేశాను. ‘దసరా’ను ఎంత ఎంజాయ్ చేశానో, ‘హాయ్ నాన్న’ను అంతే ఎంజాయ్ చేశా. ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’. 

‘‘ఎవరైనా నన్ను ఫ్యామిలీ హీరో అన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇటీవల వెంకటేష్ గారు కూడా ప్రేక్షకులు తన తర్వాత ఫ్యామిలీ హీరోగా నన్ను చూస్తున్నారని అన్నారు. కానీ నేను అన్ని రకాల చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. ఒకే ఇమేజ్‌‌లో పడిపోకుండా కొత్త దారుల్లో వెళ్లడానికి ప్రయత్నిస్తా.  ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా మనసుని ఫాలో అవుతాను. దానిని ఫాలో ఐతే పెద్ద తప్పులు జరగవని నా ఫీలింగ్. మనసుకు నచ్చినది చేయడంలో ఓ నిజాయితీ ఉంటుంది’’.