Premante Review: ‘ప్రేమంటే’ ఫుల్ రివ్యూ.. పెళ్లి తర్వాత థ్రిల్ చేసేలా ప్రియదర్శి రొమాంటిక్‌ కామెడీ

Premante Review: ‘ప్రేమంటే’ ఫుల్ రివ్యూ.. పెళ్లి తర్వాత థ్రిల్ చేసేలా ప్రియదర్శి రొమాంటిక్‌ కామెడీ

టాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి పులికొండ ( Priyadarshi Pulikonda). కమెడియన్ గా టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. ఇపుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్, 35 చిన్న కథకాదు, కోర్ట్ తదితర సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ప్రేమంటే (Premante) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం (2025 నవంబర్ 21న) ప్రేమంటే మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీలో ప్రియదర్శి సరసన ఆనంది (Anandhi) హీరోయిన్గా నటించింది. సుమ కనకాల కీలక పాత్ర పోషించింది.

కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. 'థ్రిల్ యు ప్రాప్తిరస్తు' అనే ట్యాగ్‌‌‌‌లైన్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎలా ఉంది? ప్రియదర్శికి ఖాతాలో హిట్ పడిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం 

కథేంటంటే:

పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్‌‌‌‌గా ఉండాలని కోరుకునే అమ్మాయి ర‌మ్య (ఆనంది). అతి శుభ్రత అనే ఓ డిజార్డర్ ఉంటుంది. రమ్యకు థ్రిల్లింగ్‌ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం. చదువు కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తుంటుంది. మరోవైపు, తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు మధుసూద‌న్ అలియాస్ మధి (ప్రియ‌ద‌ర్శి). వీరిద్దరి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.పెళ్లి తర్వాత తమ లైఫ్ ఎలా ఉండాలో వీరిద్దరు ముందే ఊహించుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తమ ఇంట్లో పెద్ద‌వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూ వస్తుంటారు ర‌మ్య, మధుసూద‌న్. అలా ఓ పెళ్లిలో అనుకోకుండా ర‌మ్య, మధుసూద‌న్లు క‌లుస్తారు. తర్వాత వారి అభిప్రాయాలూ, ఇష్టాలు, ఆలోచనలు క‌లుస్తాయి. ఇక వారిద్దరి మధ్య అన్నీ క‌లిసి రావ‌డంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అలా వారు ఊహించినట్టుగానే తమ కలల సామ్రాజ్యంలోకి అడుగుపెడతారు. మూడు నెలలు వివాహ జీవితం సజావుగా సాగుతుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

ఈ క్రమంలోనే రమ్య తన భర్త మధుసూద‌న్  గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇక మధుసూదన్ నుంచి రమ్య వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. చివరగా భర్త మధుసూద‌న్కు మారడానికి.. ఒక్క అవకాశం ఇస్తుంది. మరొక సంఘటన తర్వాత, రమ్య ఒక ఊహించని డెసిషన్ తీసుకుంటుంది. అది మధుసూద‌న్కు బిగ్ షాక్ ఇస్తుంది.

అసలు రమ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? మధుసూద‌న్ చేసే పని ఏంటీ? ఆ పని గురించి తెలిశాక ర‌మ్య ఎలా స్పందించింది? హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ).. వీరి మధ్యలోకి ఎలా రావాల్సి వచ్చింది? పెళ్లి త‌ర్వాత వీరి ఊహించిన జీవితం ఎందుకు తలక్రిందులు అయింది? మొత్తానికి వీరిద్ద‌రి వైవాహిక జీవితానికి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇద్ద‌రి మ‌ధ్య బంధం కొన‌సాగిందా? లేదా? అన్నది తెలియాలంటే ప్రేమంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.