
హైదరాబాద్ : హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కారు ప్రమాద దృశ్యాలను అక్కడి స్థానికుడు కార్తీక్ తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ సమయంలో కారు దిగి పరుగులు పెడుతున్న రాజ్ తరుణ్ ను వెంటాడి పట్టుకున్నాడు. తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన వీడియోలు బయటకు వచ్చాయి.
అయితే ఆ వీడియోలు ఇవ్వమని కార్తీక్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర తనను ఫోన్ లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ తెలిపాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు తెలిపాడు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్ తరుణ్ ను పోలీసులు విచారించలేదు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన రెండు రోజులు తరువాత ఓ వీడియో ద్వారా.. తాను క్షేమంగానే ఉన్నట్లు, సీటు బెల్టు పెట్టుకోవడంతో బయటపడినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
అంతా అబద్దం..
అయితే కార్తీక్ చెప్పేదంతా అబద్దమని ..వీడియో అడ్డంపెట్టుకుని తమని రూ.5లక్షలు డిమాండ్ చేశాడని తెలిపాడు రాజా రవీంద్ర. రాజ్ తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఐదు లక్షలు ఇస్తేనే వీడియోలు తీసేస్తానని కార్తిక్ డిమాండ్ చేశాడని చెప్పాడు రాజా రవీంద్ర. రాజ్ తరుణ్ కెరియర్ పోతుందని మూడు లక్షలు ఇస్తామన్నా..కార్తీక్ ఒప్పుకోలేదని తెలిపాడు. అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే మీడియాకు వీడియోలు లీక్ చేస్తానని కార్తీక్ బెదిరించాడని తెలిపిన రాజా రవీంద్ర..అంత డబ్బులు ఇవ్వలేకే మేము సైలెంట్ అయ్యామని తెలిపాడు. న్యాయ పరంగా ముందుకు వెళ్దామనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు రాజా రవీంద్ర.