
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రాబోతున్నాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా ఇది. టైటిల్ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇందులో రిషి అనే పాత్రలో నవ్వుతూ, నవ్విస్తూ కనిపిస్తా. నందిని రెడ్డి డైరెక్షన్, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నటించడం లక్కీగా ఫీలవుతున్నా. నందిని రెడ్డి సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. ఎమోషన్ సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి.
మాళవిక కళ్లతోనే నటించగల అరుదైన నటి. ఈ విషయంలో ఆమెను చూసి ఒక్కోసారి జెలసీ ఫీలవుతా. మాది మూడు స్టేజీల్లో కథ నడుస్తుంది. ప్రతి చోటా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వాసుకి లాంటి సీనియర్స్‌తో నటించడం హ్యాపీ. ఈ సినిమా తర్వాత నాకన్నీ శుభ శకునాలే అని నమ్ముతున్నా’’ అన్నాడు.
అలాగే మదర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ ‘నటుడిగా సినిమాలు చేయడం పట్ల అమ్మ చాలా హ్యాపీగా వుంది. నటుడిగా గ్యాప్ వచ్చినప్పుడు అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలుగుతున్నాను’ అని చెప్పాడు.