అస్సాం నుంచి వచ్చిన భైరవి ఆర్థ్యా .. ‘కొత్త మలుపు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా జూన్ 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం.
అస్సాంలో పుట్టి పెరిగినా తెలుగు సినిమాలు చూస్తూ నటిగా మారాలనుకున్నా. దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఆడిషన్స్ ఇస్తూ, తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నించా. అప్పుడే ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. ఇందులో నా పాత్ర పేరు వరలక్ష్మి. ఆమె కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి.
చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే అందమైన పాత్ర ఇది. కోనసీమలోని కొబ్బరి తోటలు, అక్కడి సంస్కృతి, ఆహారం అన్నీ నాకు కొత్త అనుభవం. హీరో ఆకాష్, డైరెక్టర్ శివ వరప్రసాద్ నాకెంతో సపోర్ట్ చేశారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సస్పెన్స్ అన్నీ ఉంటాయి. ఈ చిత్రంతో నా కెరీర్ కూడా ‘కొత్త మలుపు’ తీసుకుంటుందని నమ్ముతున్నా’ అని చెప్పింది.
