
- ఐశ్వర్య మెనన్
టాలీవుడ్‌కి పరిచయమైన మరో కొత్త నటి. చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం ఉన్న ఈ అమ్మాయి టీవీ సీరియల్‌తో తెరంగేట్రం చేసింది. అయితే, అందులో నటిస్తుండగానే సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. మొదట్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించిన ఈమె తక్కువ టైంలోనే లీడ్ రోల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఐశ్వర్య లేటెస్ట్గా ‘స్పై’ సినిమాతో టాలీవుడ్‌ని పలకరించింది. ఐశ్వర్య మెనన్ ఫ్యామిలీ కేరళలోని చంద్రమంగళం అనే చిన్న ఊరికి చెందిన వాళ్లు. కానీ, ఐశ్వర్య పుట్టి పెరిగిందంతా తమిళనాడులోని ఈరోడ్‌లో. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్‌ని వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదివింది. తర్వాత ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది. ఇంజినీరింగ్ చదివిన ఐశ్వర్య సినిమాల్లోకి ఎలా వచ్చింది? ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే...
మొదట్నించీ ఇంట్రెస్ట్
‘‘మా అమ్మ పేరు జయ ముకేశ్ మెనన్. మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసేది. నాన్న వరద రాజన్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో పనిచేస్తారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తన పేరు అభిషేక్ మెనన్. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే స్కూల్లో డ్రామా కాంపిటీషన్స్‌లో పాల్గొనేదాన్ని. ఆ ఇంట్రెస్ట్‌తో కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. నా ఇంట్రెస్ట్ చూసి మొదట్లో మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసేవారు. కానీ ‘ముందు అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచెయ్యి తర్వాత చూద్దాం’ అన్నారు. దాంతో చదువు మీద కాన్సన్ట్రేట్ చేశా. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు పనిచేశాక నా కల నెరవేర్చుకోవాలని డిసైడ్ అయ్యా. దాంతో జాబ్‌కి రిజైన్ చేసి, యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టా.
సినిమా అంటే థియేటర్లోనే..
ఖాళీ టైం దొరికితే బయటకు వెళ్లడం ఇష్టం ఉండదు. షూటింగ్స్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటా. ఇంతకుముందు అయితే థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడడం బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ, యాక్టర్ అయ్యాక థియేటర్‌కు వెళ్లడం కుదరడంలేదు. అది మిస్ అవుతున్నా. థియేటర్లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. థియేటర్లో తప్ప ఎక్కడ చూసినా ఆ ఫీల్ రాదు. మొదటిసారి థియేటర్లో సినిమా చూసింది నేను ఏడో తరగతి చదివేటప్పుడు. అదికూడా ఫ్రెండ్స్‌తో వెళ్లా. ఆ రోజు ఎంత ఎంజాయ్ చేశానో చెప్పాలంటే మాటలు చాలవు. నాకు ‘దళపతి’ విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఫస్ట్ డే... ఫస్ట్ షో చూడాల్సిందే. అలాగే రజినీకాంత్, అజిత్ సినిమాలు కూడా మొదటిరోజే చూసేదాన్ని. ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, అరుస్తూ.. సినిమా చూస్తే భలేబాగుంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడటం అనే ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. లాక్‌డౌన్‌కి ముందు వచ్చిన నా సినిమా ‘నాన్ సిరితల్’. ఆ సినిమాని మా టీం, అమ్మానాన్నలతో కలిసి చూశా.
ఫిట్నెస్ జర్నీ
స్క్రీన్‌మీద నన్ను చూసిన వాళ్లలో చాలామంది నా ఫిట్నెస్ గురించి అడుగుతుంటారు. ఆ జర్నీ గురించి చెప్పబోయే ముందు మీకో విషయం చెప్పాలి. లావుగా ఉన్నామని బాధపడేవాళ్లకి నా ఫిట్నెస్ జర్నీ తప్పక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేదాన్ని. స్కూల్లో నన్ను అందరూ ఫ్యాట్ గర్ల్ అని పిలిచేవాళ్లు. ‘మైదా పిండి ముద్దలా ఉన్నావ్’ అంటూ కామెంట్స్ చేసేవాళ్లు. నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాళ్లు. అదంతా నాకు చాలా చిరాకు తెప్పించేది. ఆ కామెంట్స్ తీసుకోలేకపోయేదాన్ని. అలాగని వెంటనే వాళ్లకు రిటార్ట్ ఇచ్చేదాన్ని కాదు. చిన్నప్పుడు నేను అమాయకంగా ఉండేదాన్ని. అందుకే వాళ్లు నన్ను ఏ కామెంట్ చేసినా రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. కానీ, నా మైండ్‌లో మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోవద్దు అనుకునేదాన్ని.
నా గుర్తింపు ‘లావు’ కాదు. ఇకమీదట నా లావుతో నన్ను గుర్తించకూడదు అనుకున్నా. దాంతో పదహారేండ్ల వయసు నుంచి ఫిట్నెస్ జర్నీ మొదలుపెట్టా. అప్పటి నుంచి బాగా కష్టపడ్డా. స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అయ్యా. దాంతో చాలా సన్నగా అయ్యా. చెప్పాలంటే నా లైఫ్‌లో అదంతా ఒక ఫేజ్. కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యా. వేరేవాళ్లను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి అనుకున్నా. నాకు నేను ఎలా నచ్చితే అలానే ఉండాలి అనుకున్నా. లావు, సన్నం కాదు హెల్దీగా, ఫిట్‌గా ఉండాలి. ఆ ఆలోచన వచ్చాక వర్కవుట్స్ మొదలుపెట్టా. ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు ఫిట్నెస్ అనేది నా లైఫ్ స్టయిల్లో ఒక పార్ట్. ఫిట్నెస్ విషయంలో నాలో ఇంత పాజిటివ్ మార్పు రావడానికి కారణమైన వాళ్లకి... అంటే ‘నువ్వు లావుగా ఉన్నావ’ని నన్ను విమర్శించిన వాళ్లందరికీ ‘థ్యాంక్స్’. వాళ్లలా అనడం వల్లే ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకున్నా. నేను భరతనాట్యం డాన్సర్‌ను. పాటలు బాగా పాడతా. ఇన్ని చేయగలుగుతున్నానంటే కారణం మా అమ్మ. ఆమే నా రోల్‌మోడల్” అని చెప్పింది ఐశ్వర్య.
– ప్రజ్ఞ
అప్పుడు మొదలైంది
2012లో మొదలుపెట్టా. తమిళ టెలివిజన్ సీరియల్ ‘తెండ్రల్’లో శ్రుతి అనే మైనర్ గర్ల్ రోల్ చేశా. అదే ఏడాది తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో చేశా. అదే తమిళంలో ‘కాదలిల్ సోదప్పువ్వదు యెప్పడి’ పేరుతో విడుదలైంది. తర్వాత ఏడాది తమిళంలో తల్లీకూతుళ్ల రిలేషన్షిప్ ఆధారంగా వచ్చిన ‘యాపిల్ పెన్నె’లో నటించా. ఆ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ‘తీయ వెలై సెయియ్యానుమ్ కుమరు’ అనే సినిమాలో చేశా. కన్నడ సినిమాలో ‘దసవల’ అనే ‘అక్షర’ పాత్రతో పరిచయమై, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘నమో భూతాత్మ’ సినిమాలో కూడా నటించా. మలయాళంలో ‘మాన్సూన్ మ్యాంగోస్’ పేరుతో వచ్చిన సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో నటించా. ఇందులో నాది ప్రాక్టికల్‌గా ఆలోచించే ఇండిపెండెంట్ విమెన్ పాత్ర. నా నటనని మలయాళ ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. మొదటి సినిమాతోనే స్టార్ హీరో పక్కన నటించడం నా అదృష్టం.
ఆ తర్వాత ‘వీర’, ‘తమిజ్ పడం 2’, ‘నాన్ సిరితల్’, ‘వేజమ్’ వంటి సినిమాల్లో నటించా. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘స్పై’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. ఒక టైంలో స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకోవడంలో బాగా శ్రద్ధ పెట్టా. అలా ఒక ఏడాది గ్యాప్ తర్వాత ‘తమిళ పడం2’లో చేశా. కన్నడలో నమో భూతాత్మ చేసేటప్పుడు ఆ ప్రొడ్యూసర్స్‌కి నా వర్క్ బాగా నచ్చింది. దాంతో ‘వీర’ సినిమా కోసం స్క్రీన్ టెస్ట్‌కి వెళ్లమన్నారు. స్క్రీన్ టెస్ట్ ద్వారా అవకాశం రావడంతో గర్వంగా ఫీలయ్యా. సినిమాల్లోనే కాకుండా అరుణ్ విజయ్ నటించిన ‘తమిళ్ రాకర్జ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించా.