తెలుగు నాట మలయాళీ భామల హవా

తెలుగు నాట మలయాళీ భామల హవా

బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌ వుడ్.. ఈ వుడ్  చూసినా ఎక్కువగా లోకల్ అమ్మాయిలే హీరోయిన్లుగా రాజ్యమేలుతుంటారు. కానీ టాలీవుడ్‌ మాత్రం ఇందుకు అతీతం.  తెలుగు చిత్రసీమలో లోకల్ కంటే  నాన్‌ లోకల్ నటీమణులకి డిమాండ్ ఎక్కువ. అందులోనూ కేరళ నుంచి వచ్చే హీరోయిన్స్‌ ఇక్కడ చక్రం తిప్పుతుంటారు. ఇప్పటి వరకు అలా చాలామంది వచ్చారు. తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. 

రాధ..
ఉదయ చంద్రిక.. ఇదే రాధ అసలు పేరు. కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. భారతీరాజా తీసిన ‘అళైగళ్ ఓయివత్తిళ్లై’ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేశారు.  హిందీలోనూ రెండు చిత్రాల్లో నటించారు. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యారు. రాధ నటించిన మొదటి తెలుగు సినిమా ‘ప్రేమ మూర్తులు’. 1991లో ఈ సినిమా విడుదలవగానే ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి.  చిరంజీవితో  చేసిన  ‘గూండా’  రాధ కెరీర్‌ను మలుపు తిప్పింది. చిరుతో సమానంగా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కావడంతో నాగు, అడవిదొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, జేబుదొంగ, యముడికి మొగుడు, మరణ మృదంగం, స్టేట్ రౌడీ, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, కొదమసింహం లాంటి చాలా సినిమాల్లో ఆయనకి జోడీగా నటించింది. వీళ్లిద్దరి డ్యాన్స్కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు.  అయితే ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకున్న రాధ.. నటనకు పూర్తిగా బై చెప్పేశారు.  మిగతా హీరోయిన్స్ లా రీఎంట్రీ ఇస్తారేమోనని అభిమానులు ఆశించారు కానీ అలా జరగలేదు. అయితే రాధ కూతుళ్లు కార్తీక, తులసి మాత్రం కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ రాధాగా సక్సెస్ కాలేకపోయారు. రాధ సిస్టర్ అంబిక కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. ఇతర భాషలతో  పాటు తెలుగులో ప్రేమ మందిరం, నాయుడుగారి అబ్బాయి, బొబ్బిలిపులి, రాజ్‌కుమార్, కురుక్షకేత్రంలో సీత, మా నాన్నకు పెళ్లి లాంటి మూవీస్‌ చేశారు. 

రేవతి
రేవతి అసలు పేరు ఆశ. కేరళలోని కొచ్చిలో ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో జన్మించారు. భారతీరాజా తీసిన ‘మన్‌ వాసనై’ మూవీతో 17  వయసులో కెరీర్‌‌ స్టార్ట్ చేశారు. రేలంగి నరసింహారావు తీసిన ‘మానసవీణ’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ‘సీతమ్మపెళ్లి’ మూవీలో మోహన్‌బాబుకి చెల్లెలిగా నటించారు. ఆ తర్వాత తమిళంలో బిజీగా ఉండటంతో తెలుగులో గ్యాప్ వచ్చింది. కానీ నాలుగేళ్ల తర్వాత ఏఎన్నార్ లీడ్ రోల్ చేసిన ‘రావుగారిల్లు’ మూవీతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక అక్కడి నుంచి తెలుగులోనూ వరుసగా సినిమాలు చేశారు. ప్రేమ,  మృగతృష్ణ, రాత్రి, అంకురం, గాయం చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. డ్యాన్స్ మాస్టర్, మౌనరాగం, మౌనహృదయం, క్షత్రియపుత్రుడు లాంటి డబ్బింగ్ చిత్రాలతోనూ అలరించి తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ యాక్ట్రెస్‌ అయ్యారు. ఇప్పటికీ తెలుగులో నటిస్తున్నారు. రీసెంట్‌గా ‘మేజర్‌‌’లో  హీరోకి తల్లిగా కనిపించారు. వెర్సటైల్‌ యాక్టర్గా  తెలుగువారి మనసుల్లో రేవతికి ప్రత్యేక స్థానం ఉంది.

శోభన
శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిళ్లై. త్రివేండ్రమ్‌లో పుట్టారు. ట్రావెన్‌కోర్ సిస్టర్స్గా  ఫేమస్ అయిన లలిత, పద్మిని, రాగిణిలు శోభనకి అతి దగ్గరి బంధువులు. అంబికా సుకుమారన్, సుకుమారి, వినీత్ లాంటి మలయాళ యాక్టర్స్ అందరూ ఆమెకి చుట్టాలే. ‘మంగళ నాయగి’ అనే తమిళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలయ్యింది. ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.  మలయాళం, తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ శోభన చాలా చిత్రాలు చేశారు.  అజేయుడు, రుద్రవీణ, అభినందన, కోకిల, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు లాంటి చాలా హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. అల్ మోస్ట్ స్టార్‌‌ హీరోలందరితోనూ నటించారు.  చాలా యేళ్ల పాటు హీరోయిన్‌గా వెలిగాక తనకెంతో ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్పై దృష్టి పెట్టి సినిమాలు తగ్గించారు. 1997 తర్వాత తెలుగులో అంతగా కనిపించలేదు. చివరగా 2006లో ‘గేమ్’ మూవీలో నటించారు. అయితే ఆమె నటించిన మలయాళ మూవీ డబ్బింగ్ వెర్షన్ ఇటీవల ఓటీటీలో రిలీజయ్యింది. 

అసిన్
కేరళలోని ఓ క్రిస్టియన్ ఫ్యామిలీలో అసిన్  పుట్టింది. మొదట ఓ మొబైల్ కంపెనీ యాడ్‌లో నటించింది. అది సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వాకా’ అనే మలయాళ చిత్రంతో నటిగా మారింది. ఆ వెంటనే ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’లో నటించే అవకాశం వచ్చింది. ఈ  మూవీ మంచి విజయం సాధించడంతో తెలుగులో బిజీ అయిపోయింది. ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చినా, తెలుగులో వరుస చిత్రాలు చేసింది. శివమణి, ఘర్షణ, చక్రం, అన్నవరం సినిమాల్లో స్టార్ హీరోలకి జోడీగా కనిపించింది. గజిని, దశావతారం లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ మెప్పించింది. అయితే కూర్చున్న కొమ్మని నరుక్కున్న మాదిరిగా బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనే ఆశతో తెలుగు చిత్రాల్ని  పక్కన పెట్టేసింది. బీటౌన్‌లో సక్సెస్ కాకపోవడంతో ... పెళ్లి చేసుకుని యాక్టింగ్‌కి పూర్తిగా బై చెప్పేసింది. లేదంటే చాలా యేళ్ల పాటు తెలుగు సీమను ఏలేది. 

మీరా జాస్మిన్
కేరళలోని తిరువళ్లలో పుట్టిన మీరా జాస్మిన్.. ‘సూత్రధారన్’ అనే మలయాళ సినిమాతో సినిమాల్లోకి  పెట్టింది. తమిళంలో ‘రన్’... కన్నడలో ‘మౌర్య’..   తెలుగులో ‘అమ్మాయి బాగుంది’ మూవీలతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాలోనే డ్యూయెల్ రోల్ చేసి ఇంప్రెస్ చేసింది. ఆ తర్వత గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు, బంగారు బాబు, ఆఆ ఇఈ, ఆకాశ రామన్న, మోక్ష చిత్రాల్లో నటించింది. పెళ్లి చేసుకుని 2018 తర్వాత యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చింది. రీసెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా హోమ్లీ లుక్‌తో, ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్తో  తెలుగువారిని మీరా జాస్మిన్ మెస్మరైజ్ చేసింది.

నయనతార
నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. పేరెంట్స్ ఇద్దరూ కేరళవారు. అయితే నయన్ మాత్రం బెంగళూరులో పుట్టింది. ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ‘అయ్యా’ మూవీతో తమిళనాట, ‘యోగి’ చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది. తన నటనతో అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఫిదా చేసింది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. శ్రీదేవి తర్వాత లేడీ సూపర్‌‌స్టార్‌‌గా దక్షిణాది ప్రేక్షకులు ఎవరినైనా గుర్తించారంటే అది నయనతారనే. దుబాయ్ శీను, తులసి, ఆంజనేయులు, అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం, గ్రీకువీరుడు, బాబు బంగారం, జైసింహా, సైరా నరసింహారెడ్డి అంటూ అందరు స్టార్ హీరోలకు జోడీగా చక్రం తిప్పిన నయన్.. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్‌‌’లో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ‘జవాన్‌’తో బాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. తమిళ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన రేంజ్‌ ఏంటో చూపిస్తోంది. రీసెంట్ గా మహాబలిపురంలో  విగ్నేష్ ను నయనతార వివాహం చేసుకుంది. మరి తాజా ప్రాజెక్టులు పూర్తయ్యాక ఆమె సినిమాల్లో కొనసాగుతుందో లేదో చూడాలి.

కీర్తి సురేష్
పుట్టింది మద్రాస్‌లోనే అయినా కీర్తి సురేష్ మూలాలు కేరళలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె తండ్రి మలయాళీ. తల్లి మేనక మాత్రం తమిళియన్. దాంతో రెండు కల్చర్స్ మధ్యలో కీర్తి పెరిగింది.  మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయింది.  మలయాళ సినిమాతోనే హీరోయిన్‌గా మారింది.   ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది.  అమాయకమైన లుక్స్తో  ఆ సినిమాలో రామ్‌ మనసునే కాదు, తెలుగు ప్రేక్షకుల మనసును కూడా గెల్చుకుంది. అందుకే ఇక్కడ బిజీ అయ్యింది. నేను లోకల్, అజ్ఞాతవాసి, మిస్ ఇండియా, రంగ్‌దే, గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మన్మథుడు 2, జాతిరత్నాలు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే  అయినా..తెలుగు ప్రేక్షకులకి కీర్తి అంటే చాలా ఇష్టం. దానికి కారణం.. మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి నటన చూసి ఫ్లాట్ అవ్వని తెలుగువారు లేడు. మిగతా సినిమాలన్నీ కలిపినా రాని పేరుని ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఇకపై ఎన్ని సినిమాలు చేసినా ఆమె ‘మహానటి’గానే అందరికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం దసరా, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తోంది.

నిత్యామీనన్
తెలుగువారిని తన క్యూట్ లుక్స్తో  మెస్మరైజ్ చేసిన నిత్యామీనన్.. బెంగళూరులో సెటిలైన కేరళ కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడే  ద మంకీ హూ న్యూ టూ మచ్‌ అనే ఇంగ్లిష్ మూవీలోనూ, చోటీ మా అనే హిందీ సీరియల్‌లోనూ నటించింది. పెద్దయ్యాక ‘సెవెనో క్లాక్’ అనే కన్నడ సినిమాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. అయితే అందులో హీరోయిన్ కాదు. కేవలం సపోర్టింగ్ రోల్. ఆ తర్వాత రెండేళ్లకు ‘ఆకాశ గోపురం’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారిన నిత్య.. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. చబ్బీగా కనిపిస్తూ.. క్యూట్‌గా నవ్వుతూ.. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. వంక పెట్టలేని ఆమె నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఇంప్రెస్ అయిపోయారు. నిత్యని సొంత మనిషిని చేసేసుకున్నారు. ఇష్క్, జబర్దస్త్, ఒక్కడినే, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, ఆ, గమనం, స్కైల్యాబ్ లాంటి సినిమాల్లోని పాత్రలతో ద బెస్ట్ అనిపించుకుంది. రీసెంట్‌గా ‘భీమ్లానాయక్‌’లో పవన్‌ కళ్యాణ్‌తో యాక్ట్ చేసింది. హీరోయిన్‌ అంటే స్లిమ్‌గా ఉండాలి. గ్లామర్ రోల్స్ చేయాలి లాంటి స్టేట్‌మెంట్స్ను  తప్పని ప్రూవ్ చేసి చూపించిన నిత్యకి తెలుగువారి మనసుల్లో కచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంటుంది.  

అనుపమా పరమేశ్వరన్
‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ కుట్టి.. ‘అఆ’లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. అందుకే టాలీవుడ్‌లో ఆమెకి బలమైన పునాది పడింది. శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్యూ, హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు లాంటి సినిమాలతో తెలుగువారికి అనుపమ మరింత చేరువయ్యింది.  త్వరలో కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌‌ ఫ్లై లాంటి మూవీస్‌తో పలకరించబోతోంది. మొదటి సినిమా నుంచి తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం.. అనుపమని తెలుగు ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. 

నివేదా థామస్
డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకునే నివేదా థామస్‌ చెన్నైలో పెట్టింది. కానీ వాళ్ల ఫ్యామిలీ కేరళకు చెందినది. ఓ టీవీ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్గా  కెరీర్ స్టార్ట్ చేసిన నివేద.. రెండు సినిమాల్లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత ‘ప్రణయం’ అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయ్యింది. తమిళ, మలయాళ భాషల్లో పది సినిమాలు చేశాకే  తెలుగులో ఎంటరయ్యింది. మొదటి సినిమా ‘జెంటిల్‌మేన్’.  నాని హీరోగా నటించిన ఈ మూవీ నివేదకి చాలా మంచి పేరు తెచ్చింది. అదే యేడు నానితో కలిసి నటించిన మరో సినిమా ‘నిన్నుకోరి’ కూడా విడుదలై నివేదని తెలుగునాట బిజీ చేసింది. జై లవకుశ, జూలియెట్ లవరాఫ్ ఇడియెట్, 118, బ్రోచేవారెవరురా, వి, వకీల్ సాబ్ అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. త్వరలో ‘శాకిని ఢాకిని’ మూవీతో పలకరించబోతోంది. గ్లామర్‌‌కి అత్యంత దూరంగా ఉండే నివేదకి మంచి నటిగా తెలుగువారు ఫుల్ మార్కులు వేశారు.  అందుకే మిగతా భాషల్లో కంటే ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది. 

వీరి కాదు..అమలా పాల్, మమతా మోహన్ దాస్, కళ్యాణి, క్యాథరీన్ థ్రెసా, అనన్య, పూర్ణ, కళ్యాణీ ప్రియదర్శన్‌, భావన, గోపిక లాంటి ఎంతోమంది మలయాళీ అమ్మాయిలు తెలుగు సినిమాల్లో నటించారు, నటిస్తున్నారు. ఆ మధ్య ‘శ్యామ్ సింగ రాయ్‌’తో మడొన్నా సెబాస్టియన్‌ కూడా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. రీసెంట్‌గా నజ్రియా నజీమ్‌ కూడా ‘అంటే సుందరానికీ’ సినిమాతో పలకరించింది. మరి ముందు ముందు ఇంకెంతమంది వస్తారో చూడాలి!..