పొలం కొని చదును చేస్తుంటే.. లంకె బిందె దొరికింది

పొలం కొని చదును చేస్తుంటే.. లంకె బిందె దొరికింది
  • బిందె నిండా బంగారు ఆభరణాలు
  • దేవతా మూర్తులను అలంకరించే ఆభరణాలని అనుమానం
  • వెంచర్ వేసేందుకు నెల క్రితమే పొలం కొన్న కీసరవాసి నర్సింహ

జనగామ: వెంచర్ వేసేందుకు నెల రోజుల క్రితం కొన్న 11 ఎకరాల భూమిని చదును పొక్లెయినర్ తో చదును చేస్తుంటే.. లంకె బిందె బయటపడింది. బిందె నిండా కళ్లు మిరుమిట్లు గొలిపేరీతిలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ దేవతామూర్తులను అలంకరించే ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. జనగామ మండలం పెంబర్తి గ్రామం వద్ద జరిగిందీ ఘటన. కీసర ప్రాంతానికి చెందిన నర్సింహా రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం నెల రోజుల క్రితం ఇక్కడకు వచ్చి 11 ఎకరాల భూమి కొన్నాడు. పొక్లెయిన్ తీసుకొచ్చి  11 ఎకరాల భూమిని చదును చేయిస్తుండగా పెద్దగా బండరాయిలా అడ్డుతగిలింది. అనుమానంతో చూడగా లంకె బిందె బయటపడింది.  దానిలో సుమారు 5 కోలోలకుపైగా బంగారం ఆభరణాలు ఉన్నాయి. చూడడానికి దేవతామూర్తులను అలంకరించే ఆభరణాల్లా కనిపిస్తున్నాయని.. కాబట్టి తన వెంచర్ లో కొద్దిపాటి జాగాతో చిన్న గుడి కట్టించాలని అనుకుంటున్నానని పొలం యజమాని నర్సింహ చెబుతున్నాడు .అధికారులకు సమాచారం ఇవ్వడంతో లంకెబిందె బయటపడిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. లంకె బిందె దొరికిన విషయం తెలిసి స్థానికులు భారీగా తరలిరాగా పోలీసులు అదుపు చేస్తున్నారు. కాగా లంకె బిందెల్లోని బంగారు ఆభరణాలను పరిశీలించగా.. కాకతీయుల కాలం నాటి గుర్తులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు.