
- కృష్ణా, గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద
- శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో
- ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్.. సాయంత్రానికి 5.3 లక్షలకు తగ్గుదల
- శ్రీరాంసాగర్‌కు 3.2 లక్షల క్యూసెక్కుల వరద తాకిడి
- తాలిపేరు, పోచారం, రామడుగు, ఘనపూర్ వంటి మీడియం ప్రాజెక్టులూ ఫుల్
హైదరాబాద్, వెలుగు: ఓ వైపు కృష్ణా.. మరోవైపు గోదావరి నదులు ఉరకలెత్తుతున్నాయి. ఎగువ నుంచి వరదలు పోటెత్తుతుండడంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో ఉన్నతాధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించేలా ఆదేశించారు. ప్రతి మూడు గంటలకోసారి ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిపై ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రివ్యూ చేశారు. కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా.. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది.
శ్రీరాంసాగర్‌కు 3.2 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తున్నది. ఎల్లంపల్లికి రికార్డ్‌స్థాయిలో వరద పోటెత్తుతున్నది. గురువారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. దిగువకు 8 లక్షల క్యూసెక్కులకుపైగా వదిలారు. అయితే, సాయంత్రానికి ప్రాజెక్టుకు వచ్చే వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఐదున్నర లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం పది గేట్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఖుల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్నది.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 2,62,912 క్యూసెక్కుల వరద వస్తుండగా.. పది గేట్లు ఎత్తారు. విద్యుదుత్పత్తితో పాటు క్రెస్ట్ గేట్ల ద్వారా 3,21,914 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నదారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,432 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 26 గేట్లు ఎత్తారు. అంతే వరదను విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3.81 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లికి 5,14,332 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 40 గేట్లు ఎత్తి 5,91,166 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 66,605 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 62,407 క్యూసెక్కులను వదులుతున్నారు.
నిజాంసాగర్‌కు ఈ సీజన్లో తొలిసారిగా లక్ష 82 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 2.20 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాలుగైదు రోజుల క్రితం వరకు మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీళ్లు అట్టడుగున ఉండగా.. ఈ రెండు రోజుల్లోనే ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. ఈ రెండు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 12 టీఎంసీల వరకు నీళ్లు వచ్చి చేరాయి. ఇటు లోయర్ మానేరు ప్రాజెక్టులోకి ఈ రెండు రోజుల్లో 8 టీఎంసీల నీళ్లు చేరాయి.
మీడియం ప్రాజెక్టులకూ వరదపోటు
ప్రధాన ప్రాజెక్టులతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకూ వరద పోటెత్తుతున్నది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు, రామడుగు, పోచారం, కౌలాస్‌నాలా, ఘనపూర్, నల్లవాగు, జగన్నాథపూర్ పెద్దవాగు, డిండి, మూసీ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. చనాకా కొరాటా బ్యారేజీ వద్ద 53,755 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది.
తాలిపేరు ప్రాజెక్టుకు 30,815 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. రామడుగు ప్రాజెక్టుకు 49,101 క్యూసెక్కులు, పోచారానికి 43,087 క్యూసెక్కులు, ఘనపూర్‌కు 39,736, కౌలాస్నాలాకు 24,473, పెద్దవాగుకు 19 వేలు, డిండికి 10,202, మత్తడివాగుకు 10,027 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. చెరువులు కూడా నిండుతున్నాయి. మొన్నటిదాకా రాష్ట్రంలోని 30 శాతం చెరువులు కూడా నిండలేదు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని 60 శాతం చెరువులు నిండినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.
21,500 చెరువులుండగా.. 12 వేలకుపైగా చెరువులు నిండాయని పేర్కొన్నాయి. భారీ వర్షాలతో పలు కాల్వలు, చెరువులకు గండ్లు పడ్డాయి. గండ్లకు తాత్కాలిక రిపేర్లకు రూ.6 కోట్ల దాకా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. శాశ్వత రిపేర్లకు రూ.62 కోట్ల దాకా అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 95 డ్యామేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేశామన్నారు.