ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్త్ ఏర్పాటు చేశారు. జైనూర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వరుసగా రెండో రోజు ఏ ఒక్కరినీ ఊర్లోకి అనుమతించలేదు. వదంతులు ప్రబలకుండా ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేశారు. అడిషనల్ డీజీ డీజీ మహేశ్ భగవత్ జైనూరులోనే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇరువర్గాలతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ డీఎస్పీపై బదిలీ వేటు
ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై బదిలీ వేటు పడింది. జైనూర్ ఘర్షణకు పోలీసుల వైఫల్యమే కారణమని, ఇరువర్గాలతో చర్చించి అల్లర్లను అదుపు చేయడంలో జిల్లా పోలీసుల విఫలమయ్యారని ఉన్నతాధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యను కాగజ్‌నగర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్‌ను ఆసిఫాబాద్ డీఎస్పీగా నియమిస్తూ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆదివాసీ మహిళపై అత్యాచార, హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ నాయకులు శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తూర్పు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రెవెల్ల రాజలింగు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.