
వెలుగు, నెట్వర్క్: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కలెక్టర్లు సంబంధిత అధికారులతో రివ్యూ చేసి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
జిల్లాలోని 20 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉంటారని, అత్యవసర విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించామని, అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
శిథిలావస్థకు చేరిన ఇండ్లు, మట్టి మిద్దెల్లో ఉంటున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉధృతంగా ప్రవహించే వాగులు దాటకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి అన్ని సౌలతులు కల్పించాలని సూచించారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం శంకరంపేట, దంతనూరు గ్రామాల మధ్య ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాజ్ వేను పరిశీలించారు. వనపర్తి, కొత్తకోట నుంచి ఆత్మకూరు వెళ్లే వారు రాచాల మీదుగా దేవరకద్ర నుంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు.
ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలని జోగులాంబగద్వాల కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. బీచుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణా నది వరద ఉధృతిని పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మహబూబ్ నగర్ నగరంలోని ట్యాంక్ బండ్, కొత్తచెరువు పరిసర ప్రాంతాలను ఎస్పీ జానకి పరిశీలించి, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుష్కర ఘాట్, మానవపాడు మండలం అమరవాయి వాగును ఎస్పీ శ్రీనివాస్ రావు పరిశీలించారు. ప్రజలు వాగుల్లోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.