ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోన్న హై బ్లడ్ ప్రెషర్ బాధితులు

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోన్న  హై బ్లడ్ ప్రెషర్ బాధితులు
  • చాలామంది బాధితుల్లో గుర్తించడంలేదన్న డబ్ల్యూహెచ్ వో
  • గుర్తించిన వాళ్లలోనూ సరైన ట్రీట్​మెంట్​ అందట్లేదని వెల్లడి
  • 2050 నాటికి 7.6 కోట్ల మందికి ప్రాణాపాయం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) తాజా రిపోర్టులో వెల్లడించింది. చాలామంది బాధితులు తమకు బీపీ ఉందనే విషయమే గుర్తించడంలేదని పేర్కొంది. ఏళ్ల తరబడి బీపీతో సహజీవనం చేస్తున్నారని, తీరా దీనిని గుర్తించేసరికి శరీరంలో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీ ముగ్గురు పెద్దవారిలో ఒకరు బీపీ బాధితులేనని ఈ రిపోర్టులో తెలిపింది. బాధితులలో సగం మందికి తాము బాధితులమని తెలియదని వివరించింది. హైబీపీ బాధితులు ప్రతీ ఐదుగురిలో నలుగురికి సరైన ట్రీట్ మెంట్ అందట్లేదని చెప్పింది. సైలెంట్ కిల్లర్ గా వ్యవహరించే హైబీపీకి సరైన చికిత్స అందించగలిగితే ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 7.6 కోట్ల మరణాలను తప్పించవచ్చని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. దీంతో పాటు మరో 12 కోట్ల పక్షవాతం కేసులను, 7.9 కోట్ల హార్ట్​ ఎటాక్ కేసులను, 1.7 కోట్ల హార్ట్ ఫెయిల్యూర్ కేసులను కూడా తప్పించ వచ్చని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 79 ఏండ్ల మధ్య ఉన్నవారిలో 18.83 కోట్ల మంది హైబీపీతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో 32 శాతం మంది పురుషులు, 42 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీపీ ట్యాబ్లెట్లు వాడే వాళ్లు 1990 నుంచి 2019 మధ్య 65 కోట్ల మంది ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 130 కోట్లకు పెరిగిందని వివరించింది. బ్లడ్​ ప్రెషర్​ 140/90 ఎంఎంహెచ్​జీ అంతకంటే ఎక్కువ ఉన్న బాధితుల సమాచారం, లేదా ట్యాబ్లెట్లు తీసుకుంటున్న వారి సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు డబ్ల్యూహెచ్​వో తెలిపింది. ఈమేరకు జనరల్​ అసెంబ్లీ 78వ సెషన్​లో ‘అధిక రక్తపోటుపై అంతర్జాతీయ నివేదిక’ ను విడుదల చేసింది.

30% భారతీయులకే చికిత్స..

భారతీయులలో కేవలం 37% మంది మాత్రమే హైబీపీని సకాలంలో గుర్తిస్తున్నారని, వారిలో 30% మంది సరైన ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారని డబ్ల్యూహెచ్ వో నివేదికలో తేలింది. అధిక రక్తపోటు వల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ సహా ఇతరత్రా అనారోగ్యాలకు దారితీస్తున్నది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ, ఒత్తిడి తగ్గించుకుని.. బీపీని క్రమం తప్పకుండా చెక్​ చేసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడే  అవకాశాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఇండియాలో 39 శాతం మంది బాధితులు..

భారతీయుల్లో 39శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని, బాధితులకు సరైన ట్రీట్​మెంట్ ఇస్తే 2040 నాటికి కనీసం 4 కోట్ల మంది ప్రాణాలు కాపాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఉప్పు వాడకానికి సంబంధించి డబ్ల్యూహెచ్ వో సూచనలను భారతీయులు పట్టించుకోవడంలేదని, పదిరెట్లు అధికంగా ఉప్పును వినియోగిస్తున్నారని చెప్పింది. హైబీపీకి ప్రధాన కారణం ఇదేనని, దీనివల్లే భారత్ లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. వైద్యులు కూడా ఇదే చెబుతున్నా రు. మనం వాడే సాల్ట్​లో సోడియం, సాశ్చురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం తక్కువగా ఉంటున్నాయని, ఇదే హార్ట్ స్ట్రోక్స్​కు దారితీస్తున్నాయని అంటున్నారు. దేశంలో 30 ఏండ్లు దాటిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నట్లు ఇటీవలి సర్వేలో కూడా వెల్లడైందని చెప్పారు.

ఎందుకు వస్తుంది..?

ఉప్పు వాడకం ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్యం, ఒత్తిడి, ఊబకాయం, మద్యపానం హైబీపీకి కారణమని వైద్యులు చెబుతున్నారు.