హైదరాబాద్, వెలుగు: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ వాదనలను హైకోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. కాణిపాకంలో తన సోదరుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత విచారించారు. ఈ కేసును సుప్రీం కోర్టు ఇటీవల హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు బదిలీ చేసింది. దీంతో సునీల్ యాదవ్‌ను కూడా చంచల్‌గూడ జైలుకు తరలించారు. పిటిషనర్ తరఫు అడ్వొకేట్ నయన్ కుమార్ వాదనలు వినిపించారు. తన భర్త హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డిలు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.‘‘వివేకా హత్య కేసులో ఐదుగురిని సీబీఐ నిందితులుగా పేర్కొంది. సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వొద్దనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాం. ఈ హక్కు బాధితులకు ఉంటుంది” అని సౌభాగ్యమ్మ పిటిషన్‌లో పేర్కొన్నారు.
