స్టాఫ్‌‌ తప్పు చేశాక కోర్టు జోక్యం వద్దంటే ఎట్ల.?

స్టాఫ్‌‌ తప్పు చేశాక  కోర్టు జోక్యం వద్దంటే ఎట్ల.?

హైదరాబాద్, వెలుగుబ్యాలెట్​పై ఏ ముద్ర ఉన్నా  లెక్కలోకి తీసుకోవాలనే సర్క్యులర్​పై సింగిల్ జడ్జి ఆర్డర్ ను ఎత్తేయాలంటూ స్టేట్‌‌ఎలక్షన్‌‌ కమిషన్‌‌ (ఎస్​ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌‌ పిటిషన్‌‌లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని ఎస్‌‌ఈసీ చెప్పడాన్ని డివిజన్‌‌ బెంచ్‌‌ తప్పుబట్టింది.

గురువారం రాత్రి ఎస్‌‌ఈసీ ఇచ్చిన సర్క్యులర్ అమలును నిలిపివేస్తూ సింగిల్‌‌ జడ్జి జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన అప్పీల్‌‌ పిటిషన్‌‌పై శనివారం చీఫ్‌‌ జస్టిస్ ఇంట్లో విచారణ జరిగింది. తొలుత ఎస్‌‌ఈసీ తరఫున విద్యాసాగర్‌‌ వాదనలు వినిపించారు. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల్ని రద్దు చేయాలన్నారు. మెజారిటీ ఓట్ల కంటే ప్రత్యేక గుర్తులు ఓట్లు ఎక్కువ ఉన్న వార్డు డివిజన్ల ఫలితాలను ప్రకటించరాదని సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, దీని వల్ల నేరేడ్‌‌మెట్‌‌ డివిజన్‌‌ ఫలితాన్ని నిలిపివేశామని వివరించారు. చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల బెంచ్‌‌ స్పందిస్తూ.. స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ స్టాఫ్‌‌ సరిగ్గా పనిచేసుంటే స్వస్తిక్‌‌ ముద్రనే బ్యాలెట్లపై పడేది. ముందు ఒక గుర్తు నిర్ణయించాక ఓట్ల లెక్కింపునకు ఒక్క రోజు ముందు ఇతర గుర్తులను ఆమోదించాలనడం ఎంతవరకూ చట్టబద్ధమో సింగిల్‌‌ జడ్జి దగ్గర తేల్చుకోండి. స్టాఫ్‌‌కు ట్రైనింగ్‌‌ ఇవ్వకపోవడం వల్ల ఈ తప్పిందం జరిగింది. స్టాఫ్‌‌ తప్పు చేసిన ఫలితంగా ఎస్‌‌ఈసీ ఉత్తర్వులు ఇస్తే పిటిషనర్లు గురువారం అర్ధరాత్రి జడ్జి ఇంటి తలుపులు తట్టాల్సివచ్చింది. దీనికి ఎవరు కారణం? ఓట్ల లెక్కింపు కొద్ది గంటల్లో జరుగుతుందనగా సింగిల్‌‌ జడ్జి కేసును విచారించి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం. ఆ ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయనిపిస్తోంది. ఈ వివాదాన్ని సింగిల్‌‌ జడ్జి వద్దనే తేల్చుకోవాలని చెప్పింది. తీర్పు నచ్చకపోతే ఎస్‌‌ఈసీ అప్పీల్‌‌ చేసుకోవచ్చని చెప్తూ విచారణను ముగించింది.