
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- వివరాలు అందజేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)ను ఎలా నిర్ధారిస్తారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక నిబంధనలేవైనా అమలు చేస్తారా? అని ప్రశ్నించింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ను 160 ఎకరాలుగా ఎలా నిర్ధారించారో చెప్పాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేస్తూ, ఆలోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌లోని తన ప్లాట్‌లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, మెమైర్స్ (చిత్రపటాలు) ప్రకారం దుర్గం చెరువు పరిధి 65 ఎకరాల 12 గుంటలు కాగా, నీటి పారుదల అధికారులు 160 ఎకరాలని నిర్ధారించడం చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన ఉర్మిళా దేవి పిటిషన్ దాఖలు చేశారు.
అధికారుల నిర్ణయం కారణంగా సర్వే నంబర్ 47లోని తమ ప్లాట్ నంబర్ 79 ప్రభావితం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పరిధి 65 ఎకరాల 12 గుంటలుగా నిర్ధారించాలని, తమ ప్లాట్‌లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 65 ఎకరాల దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ను 160 ఎకరాలుగా ఎలా నిర్ధారించారో అధికారులు చెప్పడం లేదని పిటిషనర్ తరఫు లాయర్ రాయ్‌రెడ్డి వాదనలు వినిపించారు.
50 మీటర్ల పరిధి దాటి ఉన్న భూములను భూ సేకరణ చట్ట ప్రకారం సేకరించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించదన్నారు. వాదనలు విన్న బెంచ్.. ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ఎలా చేస్తారో చెప్పాలని లేనిపక్షంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే అమలు చేస్తామని చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.