హైకోర్టు తీర్పు అమలయ్యేనా?.. సుప్రీంకోర్టు వైపు అందరి చూపు

హైకోర్టు తీర్పు అమలయ్యేనా?.. సుప్రీంకోర్టు వైపు అందరి చూపు

గద్వాల, వెలుగు: హైకోర్టు తీర్పుతో గద్వాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. గద్వాల బీఆర్ఎస్  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ అమలు చేస్తారా? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పడంతో, ఇప్పుడంతా సుప్రీం వైపు చూస్తున్నారు. సుప్రీం కోర్టును ఆశ్రయించినా, స్టే రాదని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం స్టే వస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించడంతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించారని, ఎక్స్ పార్టీ కింద తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టులో స్టే వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన అనర్హత కేసుల్లో ఏ ఎమ్మెల్యేకు కూడా జరిమానా విధించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

తీర్పు అమలుపై అనుమానాలు..

హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్  చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీ కావడంతో అంత ఈజీగా కోర్టు తీర్పును అమలు చేయరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే రాకపోతే ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేకు తీర్పు అనుకూలంగా రాకపోతే, ఇప్పటి వరకు  ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వపరంగా తీసుకున్న ప్రయోజనాలన్నింటిని రికవరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే హైకోర్టు తీర్పుపై గద్వాల ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పడంతో డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్  దాఖలు చేశారు.

జోష్ లో బీజేపీ..

ఎమ్మెల్యేగా డీకే అరుణను హైకోర్టు ప్రకటించడంతో గద్వాల నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు ఫుల్​ జోష్ లో ఉన్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఎన్నికలకు ముందే డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలిచారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి అభినందనలు తెలుపుతున్నారు.

ఆందోళనలో బీఆర్ఎస్  క్యాడర్..

హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్  క్యాడర్ ఆందోళనలో పడింది. అనుకోకుండా తగిలిన షాక్  నుంచి ఇంకా ఆ పార్టీ నేతలు తేరుకోలేక పోతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి రంగంలోకి దిగారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ దొడ్డి దారిన ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా కృష్ణమోహన్ రెడ్డిని ఎవరూ ఏమి చేయలేరని, లేని ఆస్తులు ఉన్నాయని చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంటతడి పెట్టారు.

అసలేం జరిగింది..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  తరఫున బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పోటీ చేశారు. భార్యతో పాటు తన పేరిట ఉన్న కొన్ని ప్రాపర్టీలు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చలేదని డీకే అరుణ 2019 జనవరిలో కేసు వేశారు. ముఖ్యంగా గోదాముల ప్రాపర్టీలే ఈ కేసులో కీలకంగా మారాయని చెబుతున్నారు. డీకే అరుణ వేసిన పిటిషన్ కు స్పందించిన హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. కోర్టు నుంచి నోటీసులు తీసుకున్న నెలలోపు ఎమ్మెల్యే, ఆయన అడ్వకేట్  ద్వారా జవాబు ఇవ్వకపోవడంతో ఎక్స్ పార్టీ చేసి పిటిషనర్  తరపున సాక్షులను కోర్టు విచారించి ఈ నెల 24న కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టును ఆశ్రయించి ఉంటే ఇప్పటికే పిటిషన్  వేయాల్సి ఉండేదని లాయర్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే అవేమి వేయకపోవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.