ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
V6 Velugu Posted on Apr 07, 2021
పరిషత్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎప్పటిలాగే ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ తీర్పుతో షెడ్యూల్ ప్రకారం రేపు(గురువారం) జరగాల్సిన పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ నిలిపివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సీవీ మోహన్ రెడ్డి.. పిటిషన్ వేసిన వర్ల రామయ్యకు ఎన్నికలతో సబంధం లేదని తెలిపారు. 28 రోజుల కోడ్ నిబంధన ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్ రెడ్డి హై కోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్ పరిషత్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.