రాజీవ్ గాంధీ హత్య కేసు: నళినికి పెరోల్ మంజూరు

రాజీవ్ గాంధీ హత్య కేసు: నళినికి పెరోల్ మంజూరు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఎస్.నళినికి మద్రాసు హైకోర్టు శుక్రవారంనాడు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. రాజీవ్ హత్య కేసులో గత 27 ఏళ్లుగా నళిని యావజ్జీవ కారాగారవాస శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌ లో జరుగనున్న తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు 6 నెలల పాటు సెలవు ఇవ్వాలని, ఇందుకోసం వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరై తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆమె గత ఏప్రిల్‌లో కోరారు. ఈ క్రమంలొ జస్టిస్ట్ ఎం.ఎం.సుందరేశ్, ఎం.నిర్మల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆమెకు నెల రోజుల సాధారణ సెలవు మంజూరు చేసింది.

అయితే మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, రాజకీయనేతలను కలవరాదని, తమిళనాడు జైళ్ల రూల్స్ కు అనుగుణంగా నడుచుకోవాలని ధర్మాసనం షరతులు విధించింది. 27 ఏళ్లుగా జైలులో ఉన్నందున ఆమె ఎస్కార్ట్ ఖర్చులు భరించే పరిస్థితి లేదని, ఆమెకు అవసరమైన ఎస్కార్ట్ ఖర్చులను తమిళనాడు ప్రభుత్వం భరించాలని బెంచ్ ఆదేశించింది. 1991 మేలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా LTTE ఆత్మాహుతి బాంబర్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.