
- మరో కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో హైకోర్టు ఊరట కలిగించింది. ఒక కేసును కొట్టివేయగా, మరో కేసు విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసిన పిటిషన్లను జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి నాటి ఎంపీ రేవంత్ రెడ్డి పొనుగోడులో అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో 2019లో కేసు నమోదైంది. రేవంత్ పై ఫిర్యాదుదారుడు చేసిన అభియోగాలకు ఆధారాలు లేవని తాజా తీర్పులో హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టివేసింది.
ఈ కేసు కొనసాగింపు న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. ఇక వరంగల్ జిల్లా కమలాపూర్ లో ఎన్నికల కోడ్‌తోపాటు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి 2,500 మంది పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారంటూ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై 2021లో కేసు నమోదైంది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్ కు మినహాయింపు ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.