- ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టు అనుమతి
- క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయొద్దని ఆర్డర్స్
- కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అధికారులకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ఆమోదంతో పెరిగిన సీట్లను భర్తీ చేసుకోవడానికి ఆయా కాలేజీలకు హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. కానీ, ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయొద్దని ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వుల అమలులో అధికారులు ప్రాథమికంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, శిక్షకు సంబంధించి వారి వాదనను వింటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్, టీజీఈఏపీసెట్ కన్వీనర్ బి.డీన్‌కుమార్ కు నోటీసులు జారీ చేసింది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ఆమోదించిన ప్రకారం కంప్యూర్ సైన్స్ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతించాలని, వాటి భర్తీకి మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సెప్టెంబరు 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కేఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంజీఆర్, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ తదితర కాలేజీలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. వాటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రాథమికంగా కోర్టు ధిక్కరణే..
అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక లాయర్ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్లు దాఖలు చేశామని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. సుప్రీంకోర్టులో నూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయిందని, ఈ దశలో తిరిగి నిర్వహించడం కష్టమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ధిక్కరణ చట్టం కింద 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చన్నారు.
దీనిపై బెంచ్ స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణను ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉన్నారని, అంతేగానీ కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అంగీకరించడంలేదని పేర్కొంది. మరో రాజకీయ పార్టీకి చెందిన కాలేజీలైనందున పెరిగిన సీట్లకు అనుమతించడం లేదన్నట్టుగా ఉందని బెంచ్ వాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 23తో సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిపోనుందని, తర్వాత కాలేజీలకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినా ప్రయోజనం ఉండదని పేర్కొంది.