
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన ఆఫ్ క్యాంపస్‌లలో అడ్మిషన్లకు అనుమతి మంజూరు చేయడంపై రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి, తగిన కారణాలను పేర్కొంటూ నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. ఆఫ్ క్యాంపస్‌లలో అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అప్పీళ్లలోని పూర్వాపరాల్లోకి తాము వెళ్లడంలేదని, కాలేజీల దరఖాస్తులను ప్రభుత్వానికే పంపుతున్నామని, వాటిపై పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది.
కాలేజీలకు చెందిన ఆఫ్ క్యాంపస్‌ల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వానికి అనుమతించకపోవడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వాహిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తదితర కాలేజీలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన బెంచ్బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు డి.ప్రకాశ్ రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తమ కాలేజీల తరఫున నగరంలో ఆఫ్ క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం లేదన్నారు. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులు, డేటా సైన్స్, ఏఐఎంఎల్ తదితర కోర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్ కింద నిర్వహించుకోవడానికి ఏఐసీటీఈ అనుమతి మంజూరు చేసిందని.. అయితే, ప్రభుత్వం మాత్రం నిరాకరిస్తోందన్నారు. ప్రభుత్వ స్పెషల్అడ్వొకేట్ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆఫ్ క్యాంపస్ కాలేజీల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీతో జూన్ 11న సమావేశం నిర్వహించిందన్నారు.
ప్రస్తుతం కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభమైన తరువాత ఈ దశలో ఆఫ్ క్యాంపస్‌లకు అడ్మిషన్లు అనుమతించడం సాధ్యం కాదన్నారు. ఈ అంశాన్ని వచ్చే ఏడాది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ దశలో బెంచ్ జోక్యం చేసుకొని.. ఏఐసీటీఈ అనుమతుల మంజూరు చేయకముందు వివరణ అడిగినపుడు సకాలంలో స్పందించవచ్చు కదా అని ప్రశ్నించింది.
ఏదో ఒక కారణం చెప్పి అనుమతులను తిరస్కరించడం చెల్లదని పేర్కొంది. ఏక వ్యాక్య తీర్మానంతో కాలేజీల దరఖాస్తులను తిరస్కరించరాదని, చట్టంలోని నిబంధనల ప్రకారం తిరస్కరణకు తగిన కారణాలను పేర్కొనాల్సి ఉందని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ కాలేజీల దరఖాస్తులను చట్టప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కాలేజీల అప్పీళ్లపై విచారణను మూసివేసింది.