గ్రూప్‌‌-1లో తప్పులు జరిగాయి

గ్రూప్‌‌-1లో తప్పులు జరిగాయి
  • సొంత నిబంధనలు టీజీపీఎస్సీ మార్చడం ఏమిటి?
  • హైకోర్టులో వాదనలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌–1 పరీక్ష పేపర్ల మూల్యాంకనం నిబంధనను మార్చడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో వాదనలు జరిగాయి. సొంత నిబంధనలనే టీజీపీఎస్సీ మార్చేయడం, దీనికితోడు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు సంఖ్యలు వెల్లడించడంపై సందేహాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ జి.విద్యాసాగర్‌‌రావు వాదించారు. ఒకటికి రెండుసార్లు మూల్యాంకనం చేస్తే నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ, నిబంధనలను మార్చేయడం చెల్లదని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. గ్రూప్‌‌–1 అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో మూల్యాంకనం మూడుసార్లు చేయడంతో అనుమానాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. 

గ్రూప్‌‌–1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సోమవారం జస్టిస్‌‌ నామవరపు రాజేశ్వర్‌‌రావు విచారించారు. వాదనలపై స్పందించిన జడ్జి.. ‘‘ఒక పక్క పరీక్షలు రాసి ఉద్యోగం వస్తుందని కొందరు, మరోపక్క పరీక్షల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి వాటిని రద్దు చేయాలంటూ మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఇరుపక్షాలు చెప్పిన అంశాల జోలికి వెళ్లకుండా వాదనలు పూర్తి చేయాలి” అని చెప్పారు. పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు స్పందిస్తూ.. టీజీపీఎస్సీ 300 పేజీల అదనపు కౌంటర్​ చాఖలు చేసిందని, అందువల్ల తాజాగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. 

అందులోని కొత్త అంశాలకే తాము అనుమతిస్తామని జడ్జి తేల్చిచెప్పారు. విద్యాసాగర్‌‌ వాదిస్తూ, గత అక్టోబర్​ 21 నుంచి 27 వరకు గ్రూప్‌‌–1 మెయిన్స్‌‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. అక్టోబర్​ 27న 21,093 మంది పరీక్షకు హాజరయ్యారని, ఆ తర్వాత క్రీడల కోటా అభ్యర్థులంటూ మరో 17 మందిని చేర్చి ఆ సంఖ్య 21,110 అని, మూడోసారి ఆ అభ్యర్ధుల సంఖ్య 21,093 అని,  ఆ తర్వాత 21,085 అని మరోసారి టీజీపీఎస్సీ వెల్లడించిందని పేర్కొన్నారు.  బయోమెట్రిక్‌‌ నిర్వహించాలని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని ఆయన అన్నారు. మూల్యాంకనాన్ని తెలుగు తెలియని ఇతర రాష్ట్రాల వాళ్లతో చేయించడం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టులో వాదించారు. కాగా, వాదనలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి.