ప్రభుత్వ విధానంపై జోక్యం చేసుకోలేం .. గిరిజనులకే 100% రిజర్వేషన్లపై హైకోర్టు వ్యాఖ్య

ప్రభుత్వ విధానంపై జోక్యం చేసుకోలేం .. గిరిజనులకే 100% రిజర్వేషన్లపై  హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లోని పదవులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ నాన్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 100 శాతం రిజర్వేషన్ల వల్ల గిరిజనులు లేని గ్రామాల్లో ఎన్నికలు జరగడంలేదన్నారు. ఈ కారణంగా కొన్ని గ్రామాలకు ఏండ్ల తరబడి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. 

గిరిజన ప్రాంతాల్లో మాత్రం కేవలం గిరిజనులకే కేటాయిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, చట్టాన్ని సవరించి గిరిజనేతరులకూ అవకాశం కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో జోక్యం చేసుకోలేమన్నారు.