పంజాబ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

పంజాబ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
  • పోలీసు ఆపరేషన్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
  • ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపిన సర్కారు

చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసుల తీరుపై పంజాబ్ – హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు 80 వేల మంది పోలీసులు ఉన్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్ సింగ్ ఎలా పారిపోయాడు?” అని నిలదీసింది. మొత్తం ఆపరేషన్‌ను పక్కాగా ప్లాన్‌ చేసినప్పటికీ అమృతపాల్‌ సింగ్‌ ఎలా తప్పించుకున్నాడని పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వినోద్‌ ఘాయ్‌ని జస్టిస్‌ ఎన్‌ఎస్‌ షెకావత్‌ ప్రశ్నించారు. ఇది రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరేనని సీరియస్ అయ్యారు. అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, అతడిని విడుదల చేయాలని కోరుతూ అడ్వకేట్ ఇమాన్ సింగ్ ఖారా వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది. అమృత్‌పాల్‌ను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ స్టేటస్ రిపోర్టును తమ ముందు ఉంచాలని ఆదేశించింది. అమృత్‌పాల్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ఇన్వోక్ చేసినట్లు కోర్టుకు పంజాబ్ సర్కారు తెలిపింది. ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేసినట్లు వివరించింది.

దేశ వ్యతిరేక శక్తులను వదిలిపెట్టం: సీఎం మాన్

రాష్ట్రంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్  స్పష్టం చేశారు. ‘‘దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న శక్తులను మేం వదిలిపెట్టబోం. రాష్ట్ర ప్రజలు శాంతి, పురోగతిని కోరుకుంటున్నారు” అని తెలిపారు. అమృత్‌పాల్ ను అరెస్టు చేసేందుకు ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని, 3 కోట్ల మంది పంజాబీలు ఇందుకు సహకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నేర కార్యకలాపాలను అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.

బెంజ్ నుంచి బైక్‌.. మధ్యలో మారుతి!

ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్.. వేలాది మంది పంజాబ్ పోలీసులను నాలుగు రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు శనివారం పోలీసులు ఆపరేషన్ షురూ చేయగా.. వారి నుంచి తప్పించుకుని వెళ్తూ అదే రోజు ఉదయం 11.27కి జలంధర్‌‌లో ఓ టోల్‌ ప్లాజాను దాటుతూ సీసీకెమెరాల్లో చిక్కాడు. ఆ సమయంలో మారుతి కారులో ముందు సీటులో ఉన్నాడు. అంతకుముందు మెర్సిడెజ్ బెంజ్ కారులో కనిపించిన అమృత్‌పాల్.. ఆ కారును షాకోట్ దగ్గర రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు. తర్వాత మారుతి కారులోకి షిఫ్ట్ అయ్యాడు. తర్వాత అదే కారులో అతడు బట్టలు మార్చుకున్నాడు. తన మతపరమైన దుస్తులను విప్పేసి.. చొక్కా, ప్యాంటు వేసుకున్నాడు. తలపాగాను మార్చుకున్నాడు. రెండు బైక్‌లలో ముగ్గురు సహాయకులతో కలిసి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్‌ బార్డర్‌‌ను దాటి వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మారుతి కారును సీజ్ చేసిన పోలీసులు.. తప్పించుకునేందుకు అమృత్‌పాల్‌కు సాయం చేసిన నలుగురిని అరెస్టు చేశారు. అమృత్‌పాల్ మామ సహా 120 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు.