బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వండి : హైకోర్టు

బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వండి : హైకోర్టు
  • ఎన్నికలు పూర్తయ్యేదాకా గన్​మన్​ను ఏర్పాటు చేయండి
  • మీరు రక్షణ కల్పించకపోతే కేంద్ర బలగాలను రప్పిస్తం
  • రాష్ట్ర పోలీసులకు తేల్చిచెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కొల్లాపూర్ ఇండిపెండెంట్​ అభ్యర్థి కర్నె శిరీష (బర్రెలక్క)కు రక్షణ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆమెకు ఒక గన్​మన్​తో సెక్యూరిటీ కల్పించాలని స్పష్టం చేసింది. పోలీసులు రక్షణ కల్పించలేమని చెప్తే.. తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసి, కేంద్ర బలగాల ద్వారా రక్షణ కల్పించేలా ఆర్డర్స్​ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి బర్రెలక్క తమ్ముడిపై జరిగిన దాడి, పోలీసుల కేసే నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన ఎన్నికల ప్రచారానికి పోలీసుల రక్షణ కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ బర్రెలక్క దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ సి. వి. భాస్కర్ రెడ్డి  బెంచ్​ విచారించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పోలీసుల రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నివేదిక కోసం అవసరమైతే ఓ పరిశీలకుడిని నియమిస్తామని తెలిపింది. 

శిరీష తమ్ముడిపై దాడి చేసి, బెదిరించారు

పిటిషనర్ శిరీష (బర్రెలక్క) నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారని, సోషల్ మీడియాలో అనూహ్య స్పందన ఉందని సీనియర్ లాయర్ సి.రఘు చెప్పారు. ఆమెకు గెలుపు అవకాశాలున్నాయని, రాష్ట్ర పోలీసుల రక్షణ లేకపోవడం వల్ల గుర్తుతెలియని వ్యక్తులు ప్రచారానికి అడ్డంకులు కల్పిస్తున్నారని, పిటిషనర్ సోదరుడిపై కొందరు దాడి చేశారని, పోలీసులు కేసు కూడా నమోదైందని తెలిపారు. ఆమె సోదరుడిని దుండగులు బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది రూపేందర్  వాదిస్తూ.. అభ్యర్థుల పాదయాత్రలు, సభలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. శిరీష సోదరుడిపై జరిగిన దాడి ఘటన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. 

తనిఖీలు ఒక్కటే కాదు.. రక్షణ కూడా కల్పించాలి 

వాదనల తర్వాత జడ్జి స్పందిస్తూ.. పిటిషనర్ పై దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి పోలీసు కేసే నిదర్శనమని అన్నారు. పిటిషనర్ కు బెదిరింపులు ఉన్నప్పటికీ పోలీసులు రక్షణ కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో వాహనాలను తనిఖీ చేయడం ఒక్కటేకాదని, అభ్యర్థులకు రక్షణ కూడా కల్పించాలని పోలీసులకు తేల్చిచెప్పారు. పిటిషనర్  శిరీషకు ఎన్నికలు అయ్యే వరకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఒక్క చాన్స్ ఇయ్యండి

కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: బర్రెలక్క


వీపనగండ్ల, వెలుగు: కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య పై గళమెత్తుతానని కొల్లాపూర్  స్వతంత్ర అభ్యర్థి శిరీష(బర్రెలక్క) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తూముకుంట, సంగినేనిపల్లి, వీపనగండ్ల తో పాటు వివిధ గ్రామాల్లో శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్ యువత, ప్రజలు మేలుకొని ప్రజాసేవ చేసే అభ్యర్థికే ఓటువేసి గెలిపించాలన్నారు. 

ఎన్నికల్లో గెలిస్తే నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తానని, నిరుద్యోగ భృతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇప్పించడం, చిన్నతరహా  పరిశ్రమలను స్థాపించడం ద్వారా తన నియోజకవర్గం నుంచి ఎక్కువమందికి ఉద్యోగాలు  వచ్చేలా కృషిచేస్తానని అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, చదివిన చదువులకు ఉద్యోగాలు రాక తనలాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే  కొందరు తన తమ్ముడిపై దాడి చేయటం హేయమైనచర్య అని అన్నారు.