బిల్లుల గడువుపై.. సుప్రీంతీర్పు సమాఖ్య విధానాన్ని బలహీనపరుస్తుందా?

బిల్లుల గడువుపై.. సుప్రీంతీర్పు సమాఖ్య విధానాన్ని బలహీనపరుస్తుందా?

శాసనసభ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతున్న  విషయం గురించి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కాలక్రమాలను నిర్ణయించింది. రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం జారీచేసింది. పెండింగ్​ బిల్లులుపై ఆమోదంగా కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

తమిళనాడు స్టేట్​ వర్సెస్​ తమిళనాడు గవర్నర్​(2025) కేసులో కోర్టు నిర్ణయం వెలువడిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్​ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాని కోరారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి  బీఆర్​ గవాయ్​ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తన సలహాని ఇటీవల వెలువరించింది. ఈ సలహాని ఏకగ్రీవంగా  సుప్రీంకోర్టు ఇచ్చింది.  

బిల్లుల విషయంలో గవర్నర్​కి ఆర్టికల్​ 200 ప్రకారం మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయని, రాజ్యాంగ  స్కీమ్​ ప్రకారం పెండింగ్​ బిల్లులను కోర్టు ఆమోదం పరిగణించలేమని, న్యాయపరంగా కాలక్రమాలను కోర్టులు నిర్దేశించలేవని చెబుతూనే  సుదీర్ఘమైన జాప్యం ఉన్నప్పుడు,  కారణాలను తెలపనప్పుడు మాత్రం కొంతమేరకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవచ్చని తన సలహాలో సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఈ  సలహాని ఈ ఐదుగురు న్యాయమూర్తులలో  ఎవరు రాశారో ప్రకటించలేదు. రాజ్యాంగంలోని ఆ విధంగా కాలక్రమాన్ని నిర్ణయించే పద్ధతి లేదని జస్టిస్​ గవాయ్​ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అదేవిధంగా గవర్నర్​ కూడా సహేతుకమైన సమయంలో గవర్నర్​ తన నిర్ణయం తీసుకోవాలని, ఒక్కో కేసు నిబట్టి ఈ సహేతుకమైన సమయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

రాజ్యాంగంలో అన్ని విషయాలు  ఉండవు. రాజ్యాంగంలోనే కాదు ఏ చట్టంలోనైనా అన్ని విషయాలు ఉండవు. అందుకే కోర్టు వ్యాఖ్యానాల అవసరం ఏర్పడతాయి.

తీర్పుల్లో కొత్త ట్రెండ్​

ఈ సలహాని ఎవరు  రాశారన్న  విషయం గురించి  జస్టిస్​ గవాయ్​ మాట్లాడుతూ మేమందరమూ ఒక గొంతుకతో ఈ సలహాని ఇచ్చాం. ఇదేకాకుండా ఇలాంటిదే  మరో తీర్పులో కూడా ఆ తీర్పు ఎవరు రాశారన్న విషయంలో స్పష్టత లేదు. వీటికి ప్రత్యేకమైన కారణం లేదని,  అయోధ్య తీర్పును అనుసరించి ఈ తీర్పును ఆ విధంగా వెలువరించామని జస్టిస్​ గవాయ్​ అన్నారు. ఈవిధంగా తన కాలంలో  వెలువరించిన రెండు తీర్పుల్లో  అభిప్రాయ భేదం లేదని అందుకని పేరు రాయలేదని ఆయన వివరణ ఇచ్చారు. 

ఇదొక కొత్త ట్రెండ్ మొదలైనట్టుగా భావించవచ్చు. సుప్రీంకోర్టు రాజ్యాంగ  ధర్మాసనం ఇచ్చిన సలహాని సమర్థిస్తున్న వ్యక్తులూ ఉన్నారు. వ్యతిరేకించే వ్యక్తులూ ఉన్నారు.  రాజ్యంగా సూత్రాన్ని సమర్థించడానికి  సుప్రీంకోర్టు చేసిన మంచి ప్రయత్నమని కొందరు అభిప్రాయపడితే  ఓ మంచి అవకాశాన్ని సుప్రీంకోర్టు జారవిడిచిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. 

అత్యున్నత న్యాయస్థానంలోని  ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అది. అందులో భారత ప్రధాన న్యాయమూర్తి, నియమితుడైన న్యాయమూర్తి,  భవిష్యత్తు న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులు ఈ ధర్మాసనంలో ఉన్నారు. ఈ సలహా ఆసక్తికరంగా మారడానికి కారణం దాని నేపథ్యం. 

రాజకీయ కారణాల వల్ల గవర్నర్లు బిల్లులపై విచారణ పేరుతో నిలిపివేస్తున్నారని ఆరోపిస్తూ బెంగాల్, తమిళనాడుతో సహా కొన్ని ప్రతిపక్ష పాలిత  రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనికి ప్రతిస్పందనగా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అటువంటి ఉన్నత పదవులను కలిగి ఉన్నవారు బిల్లులపై చర్య తీసుకోవడానికి నెల గడువును నిర్ణయించింది. 

ఆర్టికల్​ 200 కింద గవర్నర్​కి ఉన్న ఎంపికలు

ఆర్టికల్​ 200 ప్రకారం మూడు విభిన్న చర్యలు మాత్రమే ఉన్నాయి. బిల్లులకు అనుమతిని మంజూరు చేయడం,  బిల్లుని రాష్ట్రపతికి పంపించడం లేదా సమ్మతిని నిలిపివేయడం తన వ్యాఖ్యలతో రాష్ట్ర శాసన సభకు  తిరిగి  పంపడంలాంటివి  గవర్నర్​  చేయవచ్చు. ద్రవ్య బిల్లులను తప్ప మిగతా బిల్లులనుగానీ దానిలోని ఏవైనా నిర్దిష్ట నిబంధనలను తిరిగి పరిశీలించాల్సిందిగా  సభకు  వాపసు  పంపించవచ్చు. గవర్నర్​కి, శాసనసభకి మధ్య డైలాగ్​ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. దానివల్ల అనుమతిని నిలిపివేసినప్పుడు శాసన సభ శక్తిహీనంగా మారకుండా ఉంటుంది. 

గవర్నర్​ విచక్షణాధికారం

ఈ మూడు విషయాల్లో గవర్నర్​కి విచక్షణాధికారం ఉంటుందని కోర్టు పేర్కొంది. గవర్నర్​ తన విచక్షణను ఉపయోగించే పరిస్థితిని రాజ్యాంగం కల్పించిందని ఇదే విషయాన్ని షంషేర్ సింగ్​ వర్సెస్​ స్టేట్​ఆఫ్​ పంజాబ్​(1974) అదేవిధంగా నభయ్​ రెబిమా వర్సెస్​ డిప్యూటీ స్పీకర్​ (2016)లో పునరుద్ఘాటించిందని కోర్టు పేర్కొంది. విచక్షణాధికారం అనేది ఒక భాగానికి  మాత్రమే పరిమితం కాదని అన్నింటికి వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. 

ఆర్టికల్​ 200, 201 ప్రకారం గవర్నర్​కి, రాష్ట్రపతికి ఉన్న అధికారాలను  యోగ్యతపై  నిర్ణయాలు  న్యాయబద్ధమైనవి కాదని కోర్టు పునరుద్ఘాటించింది. బిల్లు చట్టంగా మారిన తరువాత మాత్రమే న్యాయ సమీక్ష అందుబాటులోకి  వస్తుంది. శాసనప్రక్రియ సమయంలో బిల్లులపై  కోర్టులు తీర్పు చెప్పలేవు. 

అయితే, నిర్ణయాన్ని సమీక్షించడం,  చర్య తీసుకోకపోవడం విషయాల్లోని తేడాని కోర్టు గుర్తించింది. గవర్నర్​ నిష్క్రియాత్మకత ఉన్నప్పుడు, నిరవధికంగా చర్య తీసుకున్నప్పుడు కోర్టు పరిమితమైన ఆదేశాలను జారీ చేయవచ్చు.  ఈ ఆదేశాలు  గవర్నర్​ ఎంపికలో జోక్యం చేసుకోనివిధంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సూత్రాలు రాష్ట్రపతికి  వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ఆర్టికల్​ 201 ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం న్యాయబద్ధమైన (నాన్​ జ్యుడీషియరీ) కాదని కూడా కోర్టు తన సలహాలో పేర్కొంది. 

న్యాయసమీక్షను కోరవచ్చు

గత ఏప్రిల్​ నెలలో జస్టిస్​ జేబీ పార్ధివాలా నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్​ల నిర్ణయాలకు ఓ కాలక్రమాన్ని నిర్ణయించడం ద్వారా ఒక పరిష్కారాన్ని అందించింది. రాజ్యాంగబద్ధమైన స్థానం కారణంగా రాష్ట్రపతి, గవర్నర్లు ఈ కాలక్రమానికి కట్టుబడి ఉండలేరని సుప్రీంకోర్టు ఇప్పడు తన సలహాలో అభిప్రాయపడింది.  

గవర్నర్​ల బిల్లులపై విచారణ జరపడానికి ‘అపరిమిత అధికారాలు’ లేవని కోర్టు చెబుతున్నప్పటికీ అధిక ఆలస్యం జరిగితే రాష్ట్రాలు న్యాయసమీక్షను కోరవచ్చు. అయితే ఈ దీర్ఘకాలాన్ని, నిష్క్రియాత్మకతను  తన సలహాలో సుప్రీంకోర్టు నిర్వచించలేదు. ఇది గవర్నర్ల వ్యక్తిగతమైన కాలంగా పరిణమించే అవకాశం ఉంది. గవర్నర్​ 6 నెలల కాలాన్ని ఆలస్యంగా పరిగణించకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల కాలాన్ని నిష్క్రియాత్మక కాలంగా పరిగణించవచ్చు.  

సుప్రీంకోర్టు ఇచ్చింది ‘అభిప్రాయం’  మాత్రమే..

సుప్రీంకోర్టు ఇచ్చింది సలహా మాత్రమే.  ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలు కాదు. అందుకని కోర్టులు, రాష్ట్రాలు ఆ సలహాకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ‘డీమ్డ్​ కన్సెంట్’ అనే సిద్ధాంతం ఇప్పటికీ ఉందని అనిపిస్తున్నది. అనిపించడం కాదు ఉంది. కేంద్ర ప్రభుత్వంకానీ, గవర్నర్లు కానీ ఆ తీర్పుపై అప్పీలునుగానీ, సమీక్షనుగానీ కోరాలి. 

రాష్ట్రపతి కోరిన రెఫరెన్స్​పై తాము చెప్పింది ‘అభిప్రాయం’ మాత్రమేనని జస్టిస్​ గవాయ్​ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వంగానీ, గవర్లర్లుగానీ ఆ ద్విసభ్య ధర్మాసన తీర్పుమీద  అప్పీలుకు వెళ్లితే ఈ అభిప్రాయం ప్రకారమే తీర్పు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ సందిగ్ధత, సంశయాలు, ఫెడరల్​ విధానాలకు విఘాతం లాంటివి ఏర్పడతాయి. 

భారతదేశ సమాఖ్య మీద దీని ప్రభావం ఉంటుంది. కోర్టు అభిప్రాయం తరువాత గవర్నర్​ కార్యాలయాలు స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. గవర్నర్లు ప్రజస్వామ్యంలో ఏర్పడిన,  స్థిరపడిన  సంప్రదాయాలను గౌరవించాలని కోర్టు పేర్కొంది. ఎన్నికైన ప్రభుత్వాల ఆకాంక్షలను గౌరవిస్తారని ఆశిద్దాం.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్​జిల్లా జడ్జి (రిటైర్డ్)