పాలకుర్తి కాంగ్రెస్​ ఇన్​చార్జికి హైకోర్టు నోటీసులు

పాలకుర్తి కాంగ్రెస్​ ఇన్​చార్జికి  హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా పౌరసత్వంతో ఉన్న వారిద్దరూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా భూములు కొనుగోలు చేశారంటూ దాఖలైన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని ఝాన్సీరెడ్డి కొనుగోలు చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీరెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్​ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారించారు. వాదనల తర్వాత ఝాన్సీరెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి.