కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ లు : న్యాయమూర్తి శ్యామ్ కోశి

కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ లు : న్యాయమూర్తి శ్యామ్ కోశి
  • హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి
  • జోరుగా జాతీయ లోక్ అదాలత్ లు

నిర్మల్/మంచిర్యాల/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్​లు ఎంతగానో తోడ్పడతాయని హైకోర్ట్​ న్యాయమూర్తి శ్యామ్ కోశి అన్నారు. శనివా రం నిర్మల్​జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవన్ లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ సేవలు, కమ్యూనిటీ మీడియేషన్ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కోర్టు కేసుల్లో రాజీ మార్గాల ద్వారా ఇరు వర్గాలకూ న్యాయం చేకూరుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. 

హైకోర్టు న్యాయమూర్తి సుజన కళాసికం మాట్లాడుతూ ఏండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులకు లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు. వరకట్నం, గృహహింస, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు తక్కువ ఖర్చుతో పరిష్కరించు కోవచ్చని పేర్కొన్నారు. జిల్లా జడ్జి శ్రీవాణి, కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు పంచాక్షరి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, ఎస్పీ జానకీ షర్మిల, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కోర్టు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో 8811 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్​లో రాజీమార్గం ద్వారా సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తున్నట్లు ఆసిఫాబాద్​జిల్లా  జడ్జి ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం భవనలో నిర్వహించిన లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. యువరాజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జె.అనంతలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. సివిల్, క్రిమినల్ కేసులతో పాటు, ఎక్సైజ్, సీసీ, ఎస్టీసీ, సైబర్ క్రైమ్​లతో కలిపి 8811 కేసులను పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. ఈ కేసులకు సంబంధించి రూ.2,76,86,287 అపరాధ రుసుం రూపంలో వసూలు చేసినట్లు చెప్పారు.

మంచిర్యాలలో 3,500 కేసుల పరిష్కారం 

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన  జాతీయ అదాలత్ లో 3,500 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించామని జిల్లా జడ్జి, న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జ్ డి.రామ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, నిరోష, కృష్ణతేజలతో కలిసి హాజరయ్యారు. జిల్లాలో 9 లోక్ అదాలత్ బెంచ్​లను ఏర్పాటు చేశామని తెలిపారు. 

లోక్ అదాలత్​లో కేసుల పరిష్కారం

ఆదిలాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్​లో 3598 కేసులను పరిష్కరించారు. జిల్లా జడ్జి ప్రభాకర్ రావు కేసులను పరిశీలించి కాంప్రమైజ్ అయిన వారికి రాజీ పత్రాలు అందజేశారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి అవకాశమన్నారు.