
హైదరాబాద్, వెలుగు: అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఉద్యోగుల వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఉద్యోగులే వాటికి ఆధారాలు చూపాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆస్తులకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని తెలిపింది. ముషీరాబాద్ పోస్టాఫీస్ లో పోస్టుమ్యాన్ గా పని చేసిన ఎస్. సురేందర్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షా కాలాన్ని ఏడాదికి తగ్గించింది.
బెయిల్ పై ఉన్న అతడిని జైలుకు తరలించాలని, ఇప్పటికే అనుభవించిన జైలు శిక్షను మినహాయించి మిగిలిన కాలానికి జైలు జీవితం కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఎస్.సురేందర్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా 2005లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిని విచారించిన ఏసీబీ కోర్టు 1988లోని సెక్షన్13(2) కింద మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును రద్దు చేయాలంటూ ఎస్. సురేందర్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె. సురేందర్ ఇటీవల తీర్పు చెప్పారు.