ఎంపీ అవినాష్ను ఇప్పుడే అరెస్ట్ చేయొద్దు

ఎంపీ అవినాష్ను ఇప్పుడే అరెస్ట్ చేయొద్దు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసుకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ను హార్డ్ డిస్క్లో భద్రపరించి  ఈ నెల  13 లోగా  సమర్పించాలని  సీబీఐకి సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరో వైపు  వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో  దొరికిన లేఖను  సమర్పించాలని  కోర్టు సూచించింది.

తనను అరెస్ట్ చేయకుండా ఆదేశివ్వాలంటూ  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు విచారించింది.  ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా  అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పలు అంశాలను  హైకోర్టుకు వివరించారు. రెండు సార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించిందని అతని తరపున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.  ఈ సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో అనుమానాలున్నాయన్నారు.  ఎందుకంటే అవినాష్ స్టేట్ మెంట్ పై సీబీఐ అధికారులు సంతకాలు చేయలేదని కోర్టుకు వెల్లడించారు. అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారి స్టేట్ మెంట్ ను ఎడిట్ చేసినట్లు అనుమానాలున్నాయన్నరు. ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా అవినాష్ రెడ్డి న్యాయవాది కోర్టును కోరారు. ఈ సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు  చేశారా అని  సీబీఐ తరపు న్యాయవాదిని  హైకోర్టు  ప్రశ్నించింది. అయితే  ఎంపీ అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ఆడియో, వీడియో రికార్డ్  చేసినట్టుగా సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకానంద్ రెడ్డి హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డినే అని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అవినాష్ ను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని..ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణ కు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. 

అటు  అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటీషన్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని హైకోర్టును ఆమె ఆభ్యర్థించారు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం తర్వాత సునీతారెడ్డి న్యాయవాది వాదనలు విన్పించనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత  వైఎస్ సునీతారెడ్డి, సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలను విన్పించనున్నారు. 

మరో వైపు ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఆఫీసుకు ఉదయమే అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మూడో సారి విచారణకు హాజరు కావడంతో అరెస్ట్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో పులివెందుల నుంచి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు తరలి వచ్చారు. అయితే అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించడంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు.