
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- ఎఫ్‌టీఎల్ నిర్ధారించాక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచన
- 19 ఏళ్ల నాటి పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదాబాద్‌లోని రామంతాపూర్ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా మొత్తం ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. 3 వారాల్లోగా ప్రతివాదులు, ఇతరుల నుంచి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అభ్యంతరాలను స్వీకరించాలని, వాటిని 4 వారాల్లోగా పరిష్కరించి ఫైనల్ నోటిఫికేషన్ వెలువరించాలని, ఆరు నెలల్లోగా ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి చెరువు రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. రామంతాపూర్ పెద్ద చెరువుపై 2005లో దాఖలైన పిటిషన్ పరిష్కారమైందని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో 532 చెరువులు, 200 తోటలు అంతరించిపోతున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్ద చెరువును డంపింగ్ యార్డుగా మార్చేశారని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉండగా డాక్టర్ కేఎల్ వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించి విచారణ జరిపింది. ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదిస్తూ... ఇదే అంశంపై హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ వ్యవహారంపై విచారణ అవసరంలేదని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని, ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు తుది నోటిఫికేషన్ వెలువడిందో లేదో చెప్పాలని కోరగా.. ఫైనల్ నోటిఫికేషన్ వెలువడలేదని జవాబు చెప్పారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విషయంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించాలని ధర్మాసనం వారికి సూచన చేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించే అధికార పరిధి కోర్టులకులేదని తేల్చిచెప్పింది. చట్టప్రకారం లేక్ ప్రొటెక్షన్ కమిటీనే ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు జారీచేసి ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని తెలియజేసింది.
ప్రభుత్వమే రోడ్డు కోసం చెరువు భూమి తీసుకుంది
హైదరాబాద్–వరంగల్ రోడ్డు 30 అడుగుల నుంచి 200 అడుగుల విస్తీర్ణానికి విస్తరించినప్పుడు ప్రభుత్వమే పెద్దచెరువు భూమిని తీసుకుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. జాయింట్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సర్వే నివేదికలో పెద్దచెరువు మ్యాప్‌ను చూసి ప్రతివాదులు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ అయినట్లు పొరపాటుపడుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించే ముందు అందరి నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని తుది ఉత్తర్వులను జారీ చేసింది.