
- అక్రమ నిర్మాణాలంటూ నోటీసులిస్తే సరిపోదు
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాల వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ నోటీసులిస్తే సరిపోదని, నోటీసులు ఇచ్చారనే విషయం తెలియక అక్రమ నిర్మాణాలను జనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే అక్రమ నిర్మాణాల వద్ద ‘ఇది అక్రమ నిర్మాణం–వివాదంలో ఉన్నది’ అని బోర్డులు పెట్టాలని సూచించింది. అక్రమ నిర్మాణాలని పెద్ద బోర్డు లేదా హోర్డింగ్ వంటివి ఏర్పాటు చేస్తే క్రయవిక్రయాలు జరగవని సలహా ఇచ్చింది. ఇలా చేస్తే బిల్డర్ కూడా తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని నిర్మాణాల కొనసాగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవడమో, నిర్మాణాలు ఆపేయడమో చేస్తాడని చెప్పింది.
హైదరాబాద్, గౌలిగూడ, తోటగూడలోని అనధికారిక నిర్మాణాలపై ఉత్తర్వులు జారీ చేసినా జీహెచ్‌ఎంసీ కూల్చివేత చర్యలు తీసుకోలేదంటూ జి.శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను శుక్రవారం జడ్జి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. అక్రమ నిర్మాణం అని తేల్చి ఉత్తర్వులు జారీ చేశాక కూడా కూల్చివేత చర్యలు ఎందుకు తీసులేదని జీహెచ్‌ఎంసీని జడ్జి ప్రశ్నించారు. ప్రజలు కోర్టులకు వచ్చే వరకు చర్యలు తీసుకోకపోతే ఎలా అని నిలదీశారు. కూల్చివేతలకు ఇబ్బంది ఉంటే సీజ్ చేయాలన్నారు. కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే పోలీసులు, అధికారులు, కోర్టులపై ప్రజల్లో గౌరవం సన్నగిల్లుతుందన్నారు. తోటగూడ అక్రమ నిర్మాణాలపై తీసుకునే చర్యలను నివేదించేందుకు సమయం కావాలని జీహెచ్‌ఎంసీ న్యాయవాది కోరడంతో విచారణను జడ్జి ఈ నెల 11కు వాయిదా వేశారు.