గచ్చిబౌలి భూములు కౌలు రైతులవే..డైమండ్ హిల్స్ అసోసియేషన్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

గచ్చిబౌలి భూములు కౌలు రైతులవే..డైమండ్ హిల్స్ అసోసియేషన్  పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కౌలుదారుల హక్కులను నిర్ధారించే అధికారం ఆర్డీఓ దేనని హైకోర్టు స్పష్టం చేసింది. గచ్చిబౌలిలోని పలు సర్వే నంబర్లలోని సుమారు 190.17 ఎకరాల వివాదాస్పద భూముల్లో 36.7 ఎకరాలపై హక్కులు రక్షిత కౌలుదారులవేనని తీర్పు వెలువరించింది. ఈ భూముల్ని కొన్నామంటూ డైమండ్‌‌  హిల్స్‌‌  అసోసియేషన్, మెంబర్స్, ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టేసింది. వ్యవసాయ భూములు నివాసిత భూములుగా మార్చారని చెప్పి కౌలు హక్కులను జాయింట్‌‌  కలెక్టర్‌‌ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కౌలు రైతులు 40 పిటిషన్లు వేశారు. 

వీటిపై జస్టిస్‌‌  సీబీ భాస్కర్‌‌ రెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. కౌలుదారుల హక్కులను నిర్ధారిస్తూ ఆర్డీఓ  2013లో ఇచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమేనన్నారు. ఆర్డీఓ తీర్పును రద్దు చేస్తూ జాయింట్‌‌  కలెక్టర్‌‌  ఇచ్చిన ఆదేశాలు చెల్లవన్నారు. ఆ భూములపై కౌలుదారులకే హక్కులు ఉంటాయన్నారు. సెలవులో ఉన్న జాయింట్‌‌  కలెక్టర్‌‌  సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఇది సందేహాలకు తావిస్తోందన్నారు.

 సబ్‌‌ కలెక్టర్‌‌  తన అధికార పరిధిని అధిగమించి న్యాయపరమైన అంశాలపై ఆదేశాలిచ్చారని తప్పుపట్టారు. కౌలు/అద్దె చట్టం ప్రకారం ఆర్డీఓ కాంపిటెంట్‌‌  అథారిటీ అని, పిటిషనర్ల యాజమాన్య హక్కులను గుర్తించడంలో ఆర్డీఓ చట్టప్రకారమే చేశారని చెప్పారు. ప్రైవేట్‌‌  పార్టీల  సేల్‌‌ డీడ్‌‌లకు సంబంధించిన వివాదాలను సివిల్‌‌  కోర్టులో తేల్చుకోవాలన్నారు. రెవెన్యూ అధికారుల వద్ద కాదని తీర్పులో సూచించారు.