
హైదరాబాద్: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాంత్ అయ్యంగర్ నటించిన "అరి" సినిమా సప్తగిరి థియేటర్లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా నటించాడు. ఇటీవల గాంధీ జయంతి సమయంలో శ్రీకాంత్ అయ్యంగర్ మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ‘అరి’ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.
ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్ నటించిన విషయం తెలుసుకున్న NSUI నేతలు సప్తగిరి థియేటర్కు వెళ్లారు. శ్రీకాంత్ అయ్యంగర్ ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను చించేశారు. శ్రీకాంత్ అయ్యంగర్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. దీంతో సప్తగిరి థియేటర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ లోపల షో నడుస్తున్న సమయంలో బయట గొడవ జరగడంతో ప్రేక్షకులు కొందరు భయాందోళనతో బయటికొచ్చేశారు. గొడవ జరుగుతుందేమోనన్న భయంతో కొందరు ప్రేక్షకులు షో మధ్యలోనే థియేటర్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
►ALSO READ | Puneeth Rajkumar : మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్ కుమార్.. అప్పును చూసి అభిమానులు భావోద్వేగం!
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. శ్రీకాంత్ సోషల్ మీడియాలో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గాంధీ మహాత్ముడేమీ కాదని, ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని కామెంట్లు చేశాడు. దీనిపై దర్శకుడు తల్లాడ శ్రీకాంత్ బంజారాహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు.