
దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నాలుగు సంవత్సరాలు దాటినా.. ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో చెక్కుచేదరలేదు. ఆయన పేరుతో కన్నడనాట వీధులు కూడా వెలిశాయి. విగ్రహాల ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. అంతలా ఆయన అభిమానుల హృదాయాలలో దాగిఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు గొప్ప తీపికబురు అందింది. పునీత్ రాజ్ కుమార్ మళ్లీ ప్రాణం పోసుకున్నారు. తెరపై ఆయన కొత్త చిత్రాన్ని చూసే అవకాశం లభించింది.
మళ్లీ తెరపైకి పునీత్ రాజ్ కుమార్..
అదే త్వరలో విడుదల కానున్న 'మారిగల్లు' (Maarigallu) . లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయింది. దీనిలో పునీత్ రాజ్ కుమార్ ( అప్పు) మళ్లీ తెరపై కనిపించారు. ఇది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పునీత్ రాజ్ కుమార్ మళ్లీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించేలా చూపించారు మేకర్స్. తమ అభిమాన నటుడిని కాత్త రూపంలో మళ్లీ తెరపై చూపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని , భావోద్వేగాన్ని నింపింది..
కదంబ రాజుగా పునీత్
ఈ 'మారిగల్లు' వెబ్ సిరీస్ ను ZEE5, పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నేతృత్వంలోని సంస్థ ( PRK ప్రొడక్షన్స్ ) సంయుక్త నిర్మాణిస్తోంది. లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను నటుడు ధనంజయ వాయిస్ ఓవర్‌తో ఇటీవల విడుదల చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ను కర్ణాటక తొలి రాజవంశంగా భావించే కదంబ సామ్రాజ్య స్థాపకుడు మయూరశర్మ అవతారంలో చూపించడం ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సిక్స్‌ప్యాక్, రాజసంతో కూడిన పునీత్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కథాంశం..
'మారిగల్లు' కథాంశం కర్ణాటక చరిత్రతో ముడిపడి ఉంది. శాంతి, శ్రేయస్సులతో వర్ధిల్లిన కదంబ సామ్రాజ్యాన్ని, దాని రాజధాని 'వనవాసి (వైజయంతిపుర)'ని టీజర్ పరిచయం చేస్తుంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ గొప్ప రాజవంశం పతనం తర్వాత, 1990లలో నిధి వేటలో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. కదంబ రాజులు దాచిన నిధిని కనిపెట్టే క్రమంలో ఆశ, అత్యాశ, భయం, దైవత్వం వంటి భావోద్వేగాల కలయికగా ఈ థ్రిల్లర్ సిరీస్ రూపొందింది.
పునీత్ కలకు అశ్విని సహకారం..
'మారిగల్లు' సిరీస్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ కలను నిజం చేసింది. మా నేలపైనే పుట్టిన, కానీ సార్వత్రికమైన భావోద్వేగాలున్న కథలను వెబ్ సిరీస్ వేదికగా ప్రేక్షకులకు అందించాలని పునీత్ ఎప్పుడూ కోరుకునేవారు. మారిగల్లు ఆ కలలోని నిగూఢత, భక్తి, కర్ణాటక సాంస్కృతిక సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది అని నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. దీనికి రచన, డైరెక్షన్ దేవరాజ్ పూజారి వహించారు. ఈ సిరీస్‌లో రంగాయణ రఘు, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, ప్రవీణ్ తేజ్ వంటి ప్రముఖ నటులు నటించారు.
మా దేవుడిని మళ్లీ చూడగలుగుతున్నాం
టీజర్ విడుదలైన వెంటనే అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్ చిన్న కుమారుడైన పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్లకే (అక్టోబర్ 29, 2021న) గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన చివరి సినిమాలు 'జేమ్స్', 'లక్కీ మ్యాన్' మరణానంతరం విడుదలయ్యాయి. ఆయన వారసత్వాన్ని గౌరవించడంలో భాగంగా 'మారిగల్లు'లో పునీత్‌ను AI-జనరేటెడ్ యానిమేటెడ్ రూపంలో చూపించారు. పునీత్ సార్ మొత్తం సిరీస్‌లో ఉంటారా? అని ఒక అభిమాని ప్రశ్నించగా, బాస్ ఎంట్రీ ఊహించనిది అని మరొకరు వ్యాఖ్యానించారు. అప్పు బాస్ ఎంట్రీ! కింగ్ ఈజ్ బ్యాక్! లవ్ యూ అప్పు అని మరికొందరు స్పందించారు. మా దేవుడిని మళ్లీ చూడగలుగుతాం అంటూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..
ALSO READ : మీతో కలిసి నటించడం గొప్ప గౌరవం..
'మారిగల్లు' వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుండి ZEE5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. సాంకేతికత, కథా కథనాన్ని మిళితం చేసి పునీత్ వారసత్వాన్ని గౌరవిస్తున్న ఈ ప్రయత్నం కన్నడ ఓటీటీ కంటెంట్‌లో ఒక ప్రత్యేక ముద్ర వేయనుంది.